రాముడి పేరిట ఓట్లు అడిగేందుకు రాహుల్ గాంధీ​ ప్రయత్నాలు: స్మృతి ఇరానీ ఆరోపణ

  • అయోధ్య పర్యటనతో కాంగ్రెస్‌ కొత్త నాటకమంటూ విమర్శలు
  • ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు
  • అమేథీ, రాయబరేలీలలో అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై విమర్శలు
కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ కొత్త నాటకానికి తెరతీశారని.. రాముడి పేరిట ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అయోధ్యలో రాహుల్, ప్రియాంక పర్యటించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె ఈ విమర్శలు చేశారు.

అప్పుడు కాదని ఇప్పుడెందుకు?
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపితే.. కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాహుల్, ప్రియాంక అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్నారని.. ఈ పేరుతో కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెర లేపుతోందని విమర్శించారు. రాముడి పేరును వినియోగించుకుని ఓట్లు అడిగేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

అమేథీ, రాయబరేలీలో అభ్యర్థులేరి?
కాంగ్రెస్‌ కంచు కోటలుగా పేరొందిన రాయబరేలీ, అమేథీలలో ఆ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంపై స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు అమేథీలో సమస్యలపై దృష్టి పెట్టామని.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అమేథీ అభ్యర్థి కోసం..
రాహుల్ గాంధీ అమేథీ ఎంపీ స్థానంలో వరుసగా మూడుసార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ తరఫున స్మృతి ఇరానీ మళ్లీ బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ ప్రియాంకా గాంధీని పోటీకి దింపవచ్చనే ప్రచారం జరుగుతోంది.


More Telugu News