కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు: విజయసాయిరెడ్డి
- రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారన్న విజయసాయిరెడ్డి
- కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని వ్యాఖ్య
- వీరిద్దరూ బీజేపీతో కలవడం దారుణమని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పుడు బీజేపీతో కలవడం దారుణమని అన్నారు. నెల్లూరు నగర పరిధిలోని ఎనిమిదో డివిజన్ లో విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.