నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది: రాబర్ట్ వాద్రా

  • ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న వాద్రా  
  • బీజేపీని వదిలించుకోవాలని ఓటర్లు భావిస్తున్నారని వ్యాఖ్య 
  • గాంధీ కుటుంబానికి ప్రజల మద్దతు వుందని ధీమా 
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై దేశ ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, ఆ పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారని ప్రముఖ బిజినెస్ మ్యాన్, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ కోసం పడుతున్న కష్టాన్ని జనం గుర్తించారని అన్నారు. అందుకే దేశ ప్రజలంతా గాంధీ కుటుంబం వెనకే మద్దతుగా నిలబడ్డారని వివరించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని వాద్రా చెప్పారు. ఈమేరకు వివిధ ప్రాంతాల నుంచి తనకు విజ్ఞప్తులు అందుతున్నాయని వెల్లడించారు. వాద్రా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అమేథీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అక్కడి ప్రజలు తనను అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రెండు రోజులకు అమేథీలో పలుచోట్ల రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తాను సిద్ధమేనని వాద్రా పరోక్షంగా వెల్లడించారు. అమేథీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పారు. అమేథి నియోజకవర్గ ప్రజలతో తనకు 1999 నుంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టిన బీజేపీ లీడర్ స్మృతి ఇరానీ అమేథీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాద్రా ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీని వదుల్చుకోవడానికి వేచి చూస్తున్నారని చెప్పారు. అయితే, రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల నుంచి ఎవరిని బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని రాబర్ట్ వాద్రా వివరించారు.


More Telugu News