బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు

  • యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులు
  • నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బార్ కార్యకలాపాలు
  • ఈనెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
బేగంపేటలోని ప్రముఖ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్ లో నిబంధనలకు విరుద్ధంగా యువతుల చేత ఆశ్లీల నృత్యాలు చేయించడం, యువకులను రెచ్చగొట్టడం, చెవులు చిల్లులు పడే డీజే శబ్దాల హోరులో మద్యం తాగుతూ చిందులు వేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఆ సందర్భంగా బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది యువతులు, 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. 

టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.


More Telugu News