తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు.. అధికారుల అప్రమత్తం

  • ఇటీవల ఆసిఫాబాద్‌లో ఇద్దరి ప్రాణాలు తీసిన ఏనుగు
  • ఏనుగుల గుంపు సంచారంతో తెలంగాణ సరిహద్దులో అప్రమత్తత
  • ఆహారం, నీటిని వెతుక్కుంటూ వస్తున్నట్టు అనుమానం
ఇటీవల మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. తాజాగా, ఇప్పుడు ఆందోళన కలిగించే మరో వార్తను అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గడ్, ఒడిశాలో ఇటీవల అలజడి సృష్టించిన ఏనుగుల గుంపు ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ వైపుగా కదులుతున్న గుంపులో ఇటీవల ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం గడ్చిరోలి జిల్లాలో సంచరిస్తున్న ఈ గుంపు గోదావరి, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతాల వైపుగా కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర జిల్లా సరిహద్దులోని భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, గడ్చిరోలి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల అటవీ, వ్యవసాయ, విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.

 నిన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల అధికారులు చత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఏనుగుల సంచారాన్ని నియంత్రించే విషయమై అధికారులతో చర్చించారు. ఏనుగుల మంద తెలంగాణ దిశగా కదులుతున్నది ఆహారం కోసమా? లేదంటే, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇటీవల ఆసిఫాబాద్‌లో ఇద్దరి ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఆహారం, నీటి కోసమే వచ్చిందని, దారితప్పి రాలేదని అధికారులు అనుమానిస్తున్నారు.


More Telugu News