మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి

  • భద్రతా బలగాల ఔట్‌ పోస్టులోకి బాంబు విసిరిన సాయుధ మిలిటెంట్లు
  • రాత్రి 2.15 గంటల సమయంలో దాడి 
  • బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన‌లో దుశ్చర్య
మణిపూర్‌లో సాయుధ మిలిటెంట్లు దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన ప్రాంతంలో మోహరించిన సీఆర్‌పీఎఫ్ 128 బెటాలియన్‌ పర్యవేక్షణలో ఉన్న సెక్యూరిటీ ఔట్‌ పోస్టుపై బాంబు దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక (శనివారం) 2.15 గంటల సమయంలో మిలిటెంట్లు ఔట్‌పోస్టులోకి బాంబు విసిరారు. అది పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. సాయుధ గ్రూపు ఈ దాడి చేసిందని పేర్కొన్నారు.

సీఆర్‌పీఎఫ్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారని, అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 2.15 గంటల వరకు కొనసాగించారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు బాంబులు కూడా విసిరారని, వాటిలో ఒకటి అవుట్‌పోస్ట్‌లో పేలిందని సీనియర్ పోలీసు అధికారి వివరించారు. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎన్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీ మృతి చెందగా.. ఇన్‌స్పెక్టర్ జాదవ్ దాస్, కానిస్టేబుల్ ఆఫ్తాబ్ హుస్సేన్‌లకు గాయాలయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దాడికి తెగబడిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కాగా ఇండియా రిజర్వ్ బెటాలియన్‌ శిబిరానికి భద్రత కల్పించేందుకు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించినట్టు పేర్కొన్నారు.


More Telugu News