25 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయడం వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి

  • చిత్తూరు నుంచి తిరుపతిలోకి రౌడీలు, గూండాలను దింపేందుకు కుట్ర జరుగుతోందన్న భూమన
  • వీరు ఏజెంట్లుగా బూత్ లలో కూర్చోవడానికి వీల్లేదని వ్యాఖ్య
  • స్థానికులనే ఏజెంట్లుగా నియమించేలా చర్యలు తీసుకోవాలని విన్నపం
తిరుపతిలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు కూటమి కుట్రలు చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిత్తూరు నుంచి రౌడీమూకలు, గూండాలను దింపి అల్లర్లు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈ కుట్ర కోణంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న 25 మందికి తిరుపతిలో ఏజెంట్లను పెట్టుకునే పరిస్థితి లేదని అన్నారు. తమపై పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థికే మొత్తం అన్ని బూత్ లలో ఏజెంట్లను నియమించుకునే పరిస్థితి లేదని చెప్పారు. 

ఏజెంట్లను కూడా పెట్టుకోలేని 25 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం వెనుక కుట్ర దాగుందని భూమన అన్నారు. చిత్తూరు నుంచి వచ్చే రౌడీలు, గూండాలు పోలింగ్ బూత్ లలో ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించాలని... స్థానికంగా ఉన్న వారినే బూత్ ఏజెంట్లుగా నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News