ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 మనవే!
- వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ర్యాంకులు కేటాయించిన ‘టేస్ట్ అట్లాస్’
- ఇందులో టాప్ 50లో స్థానం సంపాదించిన 9 భారతీయ వంటకాలు
- కీమా, షాహీ పన్నీర్, ఇండియన్ దాల్ మరికొన్ని డిషెస్ కు చోటు
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ఇప్పటికే పలుసార్లు భారతీయ వంటకాలకు ఫిదా అయింది. ఎన్నో రకాల డిషెస్, డ్రింక్స్ కు వివిధ కేటగిరీల్లో తమ వెబ్ సైట్ లో స్థానం కల్పించింది. అయితే తాజాగా ఆ సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ అవాక్కు చేస్తోంది. ఎందుకంటే.. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ఆ వెబ్ సైట్ రూపొందించిన జాబితాలో ఏకంగా 9 భారతీయ వంటకాలకు చోటు లభించింది.
ఎప్పటికీ పాప్యులర్ డిష్ అయిన కీమా ఈ లిస్ట్ లో టాప్ టెన్ లో నిలిచి, 6వ స్థానం సంపాదించింది. అలాగే బెంగాల్ వాసులు తయారు చేసే చింగ్రీ మలాయ్ కర్రీ 18వ స్థానం సంపాదించింది. ఇక కుర్మాకు 22వ ర్యాంకు లభించింది. ఆ తర్వాత విందాలూ 26వ ర్యాంక్, దాల్ తడ్కా 30వ ర్యాంక్, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీర్ 34, మిసాల్ 38వ ర్యాంక్ పొందాయి. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల వారూ తయారు చేసుకొనే ఇండియన్ దాల్ ఈ జాబితాలో చివరి ర్యాంక్ పొందింది. ఇండియాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలతోపాటు ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలకు చెందిన వంటకాలన్నీ ఈ జాబితాలో చోటుదక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్ లో థాయ్ ఫానెంగ్ కర్రీ తొలి స్థానం సంపాదించింది.
కొన్ని రోజుల కిందట టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ రైస్ పుడ్డింగ్ ర్యాంకుల్లో మూడు భారతీయ స్వీట్లకు స్థానం లభించింది. ఈ మూడు స్వీట్లూ టాప్ టెన్ లోనే నిలవడం మరో విశేషం. ఇందులో నార్త్ ఇండియా ప్రజలు ఎక్కువగా చేసుకొనే ఫిర్నీకి 4వ ర్యాంక్ లభిస్తే ఖీర్ లేదా పాయసం 5వ స్థానంలో నిలిచింది. ఖీర్ ను భారతీయులు ఎన్నో రకాలుగా చేస్తుంటారని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. ఈ జాబితాలో స్థానం సాధించిన మరో తీపి వంటకం చక్కెర పొంగలి. దక్షిణ భారతీయులు సంక్రాంతి పండుగకు చేసుకొనే ఈ వంటకానికి 9వ స్థానం కేటాయించింది. అంతకుముందు ప్రపంచంలోని ఉత్తమ గొర్రె మాంసం వంటకాల్లో చాలా మంది భారతీయులు ఇష్టంగా తినే కబాబ్ లకు చోటు లభించింది.