ఇంటర్ ఫలితాల తర్వాత తెలంగాణలో ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య

  • మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిలు..
  • మంచిర్యాల జిల్లాలో ముగ్గురు విద్యార్థులు సూసైడ్
  • జడ్చర్లలో రైలు పట్టాలపై ఇంటర్ విద్యార్థి మృతదేహం
ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడిన 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏడుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ కావడంతో పలు జిల్లాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు చనిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఫస్టియర్ లో ఫెయిలవడంతో ఆవేదన చెంది సూసైడ్ కు పాల్పడ్డట్లు అనుమానం వ్యక్తం చేశారు. విచారణ జరిపి వారి ఆత్మహత్యకు కారణం గుర్తిస్తామని చెప్పారు. 

మహబూబాబాద్ లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయారని, ఇంటర్ ఫెయిలయ్యామనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని బాధితుల పేరెంట్స్ వెల్లడించారని ఎస్పీ పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో ఓ విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని డిప్యూటీ కమిషనర్ వివరించారు. నల్లకుంటకు చెందిన ఇంటర్ స్టూడెంట్ ఒకరు జడ్చర్లలోని రైల్వే ట్రాక్ పక్కన విగతజీవిగా కనిపించాడని పోలీసులు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో సరిగా మార్కులు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు వివరించారు.


More Telugu News