కూకట్‌పల్లి హత్యాచారం కేసు..1400 సీసీ కెమెరాలు గాలించి నిందితులకు సంకెళ్లు

  • సంగారెడ్డిలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న నిందితులు
  • బీహార్‌కు చెందిన నిందితుల్లో ఒకడు మైనర్
  • 45 కిలోమీటర్ల మేర సీసీ టీవీల గాలింపు
  • బాలుడు జువైనల్ హోంకు తరలింపు
మూసాపేటలో కలకలం రేపిన అత్యాచారం, హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 45 కిలోమీటర్ల మేర 1400 సీసీ కెమెరాలను జల్లెడ పట్టి ఎట్టకేలకు ఇద్దరు నిందితులను కటకటాల వెనక్కి పంపారు. వీరిలో ఒకరు బాలుడు కావడం గమనార్హం. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌‌లోని రాజమహేంద్రవరానికి చెందిన  మహిళ (45) భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయారు. దీంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్ చేరుకుంది. మూసాపేట వై జంక్షన్‌లోని ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పనిచేస్తూనే చిత్తుకాగితాలు ఏరుకుని జీవించేది. 

అత్యాచారం అనంతరం హత్య
బీహార్‌కు చెందిన 24 ఏళ్ల నితీశ్‌కుమార్ దేవ్, మరో బాలుడు సంగారెడ్డిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. ఈ నెల 20న స్నేహితుడు బీహార్ వెళ్తుండడంతో అతడిని కలిసేందుకు బైక్‌పై సికింద్రాబాద్ వెళ్లి తిరిగి వస్తూ కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో టీ తాగేందుకు ఆగారు. అక్కడ వారికి బాధిత మహిళ ఒంటరిగా కనిపించింది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన నిందితులు ఆమె భవనంలోకి వెళ్లగానే సెల్లార్‌లోని దుకాణాల వద్దకు లాక్కెళ్లి ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె తలను నేలకేసి కొట్టి చంపేసి పరారయ్యారు. 

నిందితుల కోసం నాలుగు బృందాలు
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కూకట్‌పల్లి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఘటన ప్రదేశంలోని సీసీకెమెరాలు వారి చిత్రాలు రికార్డయినప్పటికీ అస్పష్టంగా ఉండడం, వేలిముద్రలు, జాగిలాలు, నేరచరిత్ర ఆధారంగా గుర్తించాలనుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వై జంక్షన్ నుంచి సంగారెడ్డి వరకు 45 కిలోమీటర్ల మేర 1400 సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. బైక్ నంబర్ ప్లేటు కనిపించినప్పటికీ అది కూడా అస్పష్టంగా ఉంది. 

ముగ్గురి చేతులు మారిన బైక్
చివరికి అతికష్టం మీద పది బైకులను గుర్తించారు. వారిని ఆరా తీసి చివరికి నిందితుల వాహనాన్ని గుర్తించారు. అది కూడా ముగ్గురి చేతులు మారినట్టు కనుగొన్నారు. చివరిగా కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులు బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నితీశ్‌కుమార్‌ను రిమాండ్‌కు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.


More Telugu News