ఆర్బీఐ ఎఫెక్ట్.. ఒకే రోజు రూ.10,800 కోట్లు నష్టపోయిన ఉదయ్ కోటక్

  • కోటక్ మహింద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో గురువారం భారీగా పతనమైన షేర్లు
  • 13 శాతం మేర కుంగుబాటు.. ఆ ప్రభావంతో కరిగిన ఉదయ్ కోటక్ సంపద 
  • కోటక్ మహింద్రా బ్యాంక్‌లో దాదాపు 26 శాతం వాటా కలిగివున్న ఉదయ్ కోటక్
బ్యాంకింగ్ ఐటీ వ్యవస్థలో లోపాలు, గత రెండేళ్లలో పాలనాపరమైన సమస్యలను గుర్తించామని.. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ విధానాల్లో కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ కోటక్ మహింద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ బుధవారం విధించిన ఆంక్షలు ఆ బ్యాంక్ ఈక్విటీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గురువారం ఒక్క రోజే ఆ బ్యాంక్ షేర్లు ఏకంగా 13 శాతం మేర పతనమయ్యాయి. ఫలితంగా బ్యాంక్‌లో సుమారు 26 శాతం వాటా కలిగివున్న అధినేత ఉదయ్ కోటక్ ఒక్క రోజులోనే ఏకంగా రూ.10,800 కోట్ల సంపదను నష్టపోయారు. ఆసియాలోనే అత్యంత ధనిక బ్యాంకర్‌గా ఉదయ్ కోటక్‌కు ఆర్బీఐ ఆంక్షలు రూపంలో అతిపెద్ద సవాలు ఎదురైంది. ఫలితంగా ఆయన సంపదలో గురువారం భారీ క్షీణతకు దారితీసింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం గురువారం (ఏప్రిల్ 24) ఉదయ్ కోటక్ సంపద 14.4 బిలియన్ డాలర్ల నుంచి $1.3 బిలియన్లకు తగ్గింది. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మార్కెట్ ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ తొలిసారి కోటక్ మహింద్రా బ్యాంక్‌ను అధిగమించింది.

కాగా ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఉదయ్ కోటక్ గురువారం కీలక ప్రకటన చేశారు. బ్యాంక్‌కు ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకున్నామని, బ్యాలెన్స్ సంబంధిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఆర్‌బీఐ సహకారంతో పనిచేయనున్నామని తెలిపారు. ఈ ప్రకటన అనంతరం కంపెనీ షేర్లు కాస్త కోలుకున్నాయి.


More Telugu News