విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించిన మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్

  • కోహ్లీ నుంచి జట్టు ఇది ఆశించదని వ్యాఖ్య
  • 15 ఓవర్ల వరకు క్రీజులోనే ఉన్నా 118 స్ట్రైక్ రేట్‌తోనే ఆడాడంటూ ప్రస్తావన
  • సన్‌రైజర్స్‌పై 43 బంతులు ఆడి 51 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 430 పరుగులు బాదాడు. అయితే విరాట్ స్ట్రైక్ రేట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సీజన్‌లో 145.76 స్ట్రైక్ రేట్‌తో కోహ్లీ ఆడుతుండడం ఫ్యాన్స్‌ని కూడా నిరాశ పరుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు కోహ్లీపై విమర్శలు చేశారు. తాజాగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లీ 43 బంతులు ఆడి కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడి స్ట్రైక్ రేట్ 118.60గా ఉంది. ఈ ఇన్నింగ్స్‌పై టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముఖ్యమైన అర్ధ సెంచరీని నమోదు చేసినప్పటికీ చాలాసేపు బౌండరీ కొట్టలేదని గవాస్కర్ విమర్శించారు. కోహ్లీ నుంచి జట్టు ఆశించిన ఇన్నింగ్స్ ఇది కాదని వ్యాఖ్యానించారు. మధ్యలో కాస్త టచ్‌లోకి వచ్చినట్టు అనిపించినా ఆ జోరుని కొనసాగించలేదని పేర్కొన్నారు. ‘‘ఎన్ని బంతుల్లో ఎన్ని పరుగులు చేశాడనే గణాంకాలను కచ్చితంగా చెప్పలేను. కానీ 31-32 బంతుల నుంచి ఔట్ అయ్యేవరకు కోహ్లీ బౌండరీ కొట్టలేదు. ఇన్నింగ్స్ మొదటి బంతిని ఎదుర్కొని 14, 15వ ఓవర్ల వరకు క్రీజులోనే వున్న అతని స్ట్రైక్ రేట్ 118గా ఉంది. ఆటగాడి నుంచి జట్టు ఇది ఆశించేది కాదు’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నారు.

కాగా గత మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు కూడా రాణించారు. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్‌రైజర్స్‌ని 171/8 స్కోరుకే పరిమితం చేశారు. ఫలితంగా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుపై కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో తాము అద్భుతంగా పోరాడామని ఆనందం వ్యక్తం చేశాడు.


More Telugu News