పాక్ జర్నలిస్టుకు గట్టి షాకిచ్చిన అమెరికా.. అది భారత్ స్వవిషయమని స్పష్టీకరణ

  • భారత ఎన్నికల కవరేజీకి ఆస్ట్రేలియా జర్నలిస్టుకు ఎందుకు అనుమతి దక్కలేదన్న పాక్ జర్నలిస్టు
  • ఈ విషయమై భారత అధికారులే స్పందిస్తారన్న అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి
  • భారత్ వీసా విధానంపై తాము మాట్లాడబోమని స్పష్టీకరణ
  • దేశంలోకి ఎవరిని అనుమతించాలనేది భారత్ స్వవిషయమని వ్యాఖ్య 
భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కవరేజీకి విదేశీ జర్నలిస్టును కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదన్న పాక్ జర్నలిస్టు ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి గట్టి షాకిచ్చారు. ఇది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. దేశంలోకి ఎవరిని అనుమతించాలనేది భారత్ స్వవిషయమని తేల్చి చెప్పారు. ‘‘తన వీసా విధానంపై భారత్ మాట్లాడుతుంది. ఈ విషయంలో మేము ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తీకరించలేము’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. 

అయితే, ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికాస్వేచ్ఛ కీలకమని వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు. ‘‘పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య మనుగడకు కీలకమని అన్ని దేశాలకు మేము చెబుతూ ఉంటాం. అందుకే మేము నిత్యం జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాం. కానీ ఈ విషయంలో భారత అధికారులు స్పందించడం ఉపయుక్తం’’ అని ఆయన అన్నారు. 

ఎన్నికల కవరేజీకి తనను అనుమతించలేదంటూ ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్ జర్నలిస్టు అవని దియాస్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనను దేశాన్ని వీడేలా చేశారని చెప్పి ఆమె ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆమె ఆరోపణలను ఖండించాయి. అవి తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశాయి. వీసా నిబంధనల్లో వృత్తిపరమైన అంశాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అవని ఉల్లంఘించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కవరేజీ కోసం ఆమె వీసాను పొడిగిస్తామని కూడా భరోసా ఇచ్చినట్టు తెలిపాయి. ఎన్నికల కవరేజీకి అనుమతివ్వలేదన్న ఆరోపణలు కూడా అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోలింగ్ బూత్‌ల బయట విషయాలపై రిపోర్టింగ్ చేసేందుకు వీసాలు కలిగిన జర్నలిస్టులందరికీ అనుమతి ఉందని పేర్కొన్నాయి.


More Telugu News