లేటుగా వచ్చారని నామినేషన్ దాఖలుకు అనుమతి నిరాకరణ

  • నామినేషన్ చివరి రోజున పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులకు చుక్కెదురు
  • లేటుగా వచ్చారని దళిత బహుజన పార్టీ నేత మాతంగి హన్మయ్యకు అనుమతి నిరాకరణ
  • మరో స్వతంత్ర అభ్యర్థి దాసరి శ్రీకాంత్‌‌కు తప్పని నిరాశ 
  • మధ్యాహ్నం 3 లోపు వచ్చిన వారినే కలెక్టరేట్‌లోకి అనుమతిస్తామని అధికారుల స్పష్టీకరణ
ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు గురువారం చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులకు చుక్కెదురైంది. కార్యాలయానికి లేటుగా వచ్చినందుకు ఇద్దరు నేతలను నామినేషన్ దాఖలుకు అధికారులు అనుమతించలేదు. దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హన్మయ్య నామినేషన్ వేయడానికి పెద్దపల్లి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు రాగా అప్పటికి మధ్యాహ్నం 3 గంటలు దాటిందని అధికారులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, హన్మయ్య అక్కడ ఉన్న పెద్దపల్లి తహసీల్దార్ రాజ్‌కుమార్ కాళ్ల మీద పడటానికి యత్నించగా ఆయన వారించారు. స్వతంత్ర అభ్యర్థి దాసరి శ్రీకాంత్‌ కూడా ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు.  

అనంతరం, హన్మయ్య మాట్లాడుతూ తాను 3 గంటలలోపే వచ్చానని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే, అభ్యర్థులు వచ్చిన సమయం సీసీకెమెరాల్లో రికార్డు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలు కాగానే మైక్‌లో ప్రకటించి తలుపులూ మూసివేశామని చెప్పారు.


More Telugu News