నేను కూడా ముఖ్యమంత్రిగా చేశాను... కానీ ఇంత దరిద్రమైన పాలన ఎప్పుడూ చూడలేదు: కిరణ్ కుమార్ రెడ్డి

  • రాజంపేట లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి
  • ఇవాళ రాజంపేటలో ఎన్నికల ప్రచార సభ
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • చంద్రబాబుతో కలిసి మీటింగ్ కు రావడం ఇదే ప్రథమం అన్న కిరణ్
  • పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవితో గతంలో పలు సభల్లో పాల్గొన్నానని వెల్లడి  
అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ తనకోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ సభకు హాజరైన జనాన్ని చూస్తుంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయినట్టే ఉందని తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, తాను చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఇలా ఒకే వేదికపైకి రావడం ఇదే ప్రథమం అని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 

"చంద్రబాబు, మా నాన్న గారు రాజకీయాల్లో సమకాలికులు. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి, నేను గతంలో అనేక సభల్లో కలిసి పాల్గొన్నాం. ఇవాళ పవన్ కల్యాణ్ తోనూ వేదిక పంచుకోవడం ఆనందం కలిగిస్తోంది. ఈ సభకు హాజరైన జనాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అదే ఊపును మే 13న జరిగే పోలింగ్ వరకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది. 

నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను... పరిపాలన తెలిసినవాడిని. కానీ ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో చూడలేదు. ఇక్కడ తండ్రీకొడుకులు ఉన్నారు... ఒకరు మంత్రి, ఒకరు ఎంపీ. మూమూలుగా ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేయాలి. కానీ వీళ్ల నిర్వాకం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. 

పించ ప్రాజెక్టు వద్ద ఇసుక దోపిడీ చేశారు. పించ ప్రాజెక్టు వద్ద మరమ్మతులు చేయకపోవడం వల్లే అన్నమయ్య డ్యాంపై ఆ ప్రభావం పడి కొట్టుకుపోయింది. 39 మంది మరణించారు. 2 వేలకు పైగా మూగజీవాలు ప్రాణాలు విడిచాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు నష్ట పరిహారం అందలేదు. 

పేదల పట్ల ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం అవసరమా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. యువకులు ఇంతమంది ఉన్నారు... ఉద్యోగాలు ఏమయ్యాయి? డీఎస్సీ పెడుతున్నారా? అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఓ మాఫియాగా తయారైంది" అంటూ కిరణ్ కుమార్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News