రెండో రోజు ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర

  • సూర్యాపేట నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర
  • పలు గ్రామాల్లో కేసీఆర్‌కు ఘన స్వాగతం
  • సాయంత్రం భువనగిరిలో కార్నర్ మీటింగ్, రోడ్డు షో
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. సూర్యాపేట నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం భువనగిరిలో రోడ్డు షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సూర్యాపేట నుంచి భువనగిరి వచ్చే మార్గమధ్యంలో అర్వపల్లి, తిమ్మాపూర్ తదితర ప్రాంతాల్లో కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. కేసీఆర్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

జనగాం మీదుగా కేసీఆర్ భువనగిరి చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు భువనగిరిలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డు షోలో పాల్గొంటారు. కేసీఆర్ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగుతుంది. నిన్న మిర్యాలగూడలో ప్రారంభమై ఈ బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ముగుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు.

కేసీఆర్‌ను కలిసి పంట ఎండిపోయిందని రైతు ఆవేదన

సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండా రైతు ధరావత్ నర్సింహ గురువారం కేసీఆర్‌ను కలిశారు. తన పొలానికి నీళ్లు అందక పూర్తిగా ఎండిపోయిందని వాపోయారు. తన ఐదు ఎకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో అవేదనతో తన పొలంలోనే దుఃఖించిన ఈ రైతు వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది.


More Telugu News