మోదీ, రాహుల్​ ల వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్​లకు ఈసీ నోటీసులు

  • మోదీ, రాహుల్ కోడ్ ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు
  • వాటి కాపీలను బీజేపీ, కాంగ్రెస్ లకు పంపిన ఈసీ
  • స్టార్ క్యాంపెయినర్లు హుందాగా మాట్లాడేలా చూడాలని స్పష్టీకరణ
  • ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటలలోగా వివరణలు అందజేయాలని ఆదేశం
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, వారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. దీనిపై వివరణ తీసుకుని అందించాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటలలోగా తమకు వివరణ అందజేయాలని ఆదేశించింది. 

హుందాగా ఉండేలా చూడండి
తమ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల కోడ్ కు అనుగుణంగా, హుందాగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మోదీ, రాహుల్ గాంధీలపై వచ్చిన ఫిర్యాదుల కాపీలను కూడా అందజేసింది.

ఇంతకీ మోదీ ఏం వ్యాఖ్యలు చేశారు?
ఇటీవల రాజస్థాన్ లోని బన్స్వారాలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ.. ‘‘దేశంలో మహిళల వద్ద ఉన్న బంగారం లెక్కలు తీస్తామని.. సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. మరి వాళ్లు ఎవరికి పంచుతారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ ఆస్తులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని చెప్పింది. అంటే వాళ్లు ఎవరికి పంచుతారో అర్థమవుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు పంచుతారు. చొరబాటుదారులకు పంచుతారు. మీరు దీనికి ఒప్పుకొంటారా..?” అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలు జాతి విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయంటూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..! 
కేరళలోని కొట్టాయంలో రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తూ... “ప్రధాని మోదీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అంటున్నారు. అంటే తమిళ ప్రజలు తమిళం మాట్లాడొద్దని, కేరళ ప్రజలు మలయాళం మాట్లాడొద్దని మోదీ ఎలా అంటారు?” అని నిలదీశారు. తమిళనాడులోని కోయంబత్తూర్ లో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు కూడా చేశారు. ఈ ఘటనలపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.


More Telugu News