రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తానని ప్రమాణం చేసి, ఇలాగేనా పరిపాలించేది?: సౌభాగ్యమ్మ

  • నిందితులకు మళ్లీ టికెటివ్వడమే కాకుండా వారిని కాపాడతారా? అన్న సౌభాగ్యమ్మ 
  • సునీత వైపు న్యాయం కోసం నిలిచిన షర్మిలనూ టార్గెట్ చేస్తారా ? అంటూ ప్రశ్న  
రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసి హత్య కేసులో నిందితులను కాపాడటమేనా నీ మార్క్ పాలన జగన్? అంటూ వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు మళ్లీ టికెట్ ఇవ్వడమే కాకుండా వారిని కాపాడుతున్నారని ఆమె విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సౌభాగ్యమ్మ నేరుగా సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతో తపించిన మీ చిన్నాన్న వివేకానందరెడ్డిపై వైసీపీ పార్టీ, సొంత మీడియా వాళ్లే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండటం మనసుకెంతో బాధకలిగిస్తోందని సౌభాగ్యమ్మ అన్నారు. 2009 లో మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నువ్వు కోల్పోయినప్పుడు ఎంత బాధపడ్డావో, 2019 నుంచి మీ చెల్లెలు సునీత కూడా అంతకంటే ఎక్కువ వేదనను అనుభవిస్తోందని చెప్పారు. సొంతపార్టీవారే నీ చెల్లెళ్లను హేళన చేస్తున్నారని, నిందలు మోపుతున్నారని, అయినా నీలో ఇసుమంతైనా చలనం లేదని అన్నారు. న్యాయం కోసం రోడ్డెక్కిన సునీతను, ఆమెకు అండగా నిలిచిన నీ చెల్లెలు షర్మిలను లక్ష్యంగా చేసుకుని సొంతపార్టీ వారే నిందలు మోపుతున్నారని, అయినా ఇవేమీ నీకు పట్టడంలేదని మండిపడ్డారు. 

మన కుటుంబంలోని వారే మీ సొంత చిన్నాన్న హత్యకు కారకులు కావడం, వారికి మళ్లీ టికెట్లు ఇచ్చి వారిని కాపాడుతుండటం తనకు ఇంకా కష్టంగా ఉందన్నారు. ఇలాంటి పనులు నీకు ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజల్ని పాలిస్తానని ప్రమాణం చేసిన నువ్వు ఇలాగేనా పరిపాలించేది? అని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం వైపు నిలబడాలని కోరుకుంటున్నానని లేఖలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు.


More Telugu News