హ్యాండ్ బ్యాగ్ ఆకారంలో బ్రెడ్..! ఎప్పుడైనా చూశారా?

  • బ్రెడ్ కు పెద్ద రంధ్రం ఉండటమే దీని స్పెషాలిటీ
  • లెబనాన్ లో రోడ్లపై ఎక్కువగా అమ్మకం
  • కాక్ అనే పేరుతో ప్రసిద్ధి.. భారత్ లోనూ కొంతకాలంగా లభ్యం
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆహార సంస్కృతిలో బ్రెడ్ ఒక భాగమే.. దీన్ని ఎవరికి వారు ప్రత్యేకంగా తయారు చేసుకొని తింటుంటారు కూడా.. భారత్ లో నాన్, ఫ్రాన్స్ లో బగేట్, పోలాండ్ లో బాగెల్, దక్షిణ అమెరికాలో అరెపా.. ఇలా రకరకాల పేర్లతో ఎన్నో బ్రెడ్ లు ఉన్నాయి. అదే తరహాలో లెబనాన్ లో కాక్ అనే బ్రెడ్ బాగా ఫేమస్. అంటే అరబిక్ లో కేక్ అన్నమాట. దీన్ని పాకెట్  బ్రెడ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? ఈ బ్రెడ్ ఓ చిన్నపాటి హ్యాండ్ బ్యాగ్ ను పోలి ఉండటమే దీని స్పెషాలిటీ.

ఈ బ్రెడ్ మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది. చేతిలో పట్టుకొని వెళ్లేందుకు వీలుగా హ్యాండిల్ లేదా పర్స్ లాగా కనిపిస్తుంది. దేశ రాజధాని, అతిపెద్ద నగరమైన బీరుట్ లో వీధి వ్యాపారులు సైకిల్ పై తిరుగుతూ ఈ బ్రెడ్ ను అమ్ముతుంటారు. అయితే దీనికి పెద్ద రంధ్రం ఎందుకుందా అనే సందేహం మీకొచ్చిందా? 

దాని వెనక ఓ ప్రాక్టికల్ రీజన్ ఉందట. బ్రెడ్ తయారీదారులు దాన్ని పొయ్యిలో కాల్చాక చల్లబరిచేందుకు ఓ హ్యాంగర్ కు వేళ్లాడదీస్తారట. ఇందుకోసం వీలుగా ఉండాలనే బ్రెడ్ కు మధ్యలో అలా భారీ రంధ్రం పెడతారట. అది చల్లబడ్డాక అప్పుడు అమ్ముతారు.

దేనితో తయారు చేస్తారంటే..
గోధుమపిండి, గుడ్లు, చక్కెర, ఆలివ్ ఆయిల్ తో ఈ బ్రెడ్ ను తయారు చేసి పైన నువ్వులు చల్లుతారు. బ్రెడ్ ను కొరకగానే బయట కాస్త కరకరమంటూ లోపలంతా చిన్నచిన్న రంధ్రాలతో మెత్తగా ఉంటుంది. దీనికి వాడే వస్తువులన్నీ రోజూ ఇంట్లోవి వాడేవి కావడం వల్ల దాదాపు అందరూ సులువుగా చేసుకోవచ్చు. 

ఇండియాలోకి ఎంట్రీ..

వెరైటీగా కనిపించే ఈ డిష్ ను సన్ బన్ అనే ఈటరీ సహ వ్యవస్థాపకురాలు నతాలీ సౌబ్రా అనే మహిళ కొంతకాలం కిందట ఇండియాకు పరిచయం చేసింది. అంధేరీ ఈస్ట్ లో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసింది. అలాగే పొవాయ్, వెర్సోవాలలోనూ ఔట్ లెట్లు ఏర్పాటు చేసింది. “ఈ బ్రెడ్ ను లెబనాన్ వాసులు అచ్చంగా అలాగే తినేస్తారు. చక్కెర కలిపిన బ్లాక్ టీలో ముంచుకొని కూడా తినొచ్చు” అని నతాలీ చెప్పింది. ఇందులో లెబనాన్ సంప్రదాయ పదార్థాలైన జాటర్, సుమాక్, చీజ్, లేబ్ నే,  హమ్మస్, ఫాలఫెల్ తోపాటు ఇతర ఫ్లేవర్లతో నింపి తయారు చేస్తారని వివరించింది. ఈ బ్రెడ్ పై నువ్వులు చల్లుతారని తెలిపింది.


More Telugu News