కొలరాడోలో రెండు ఇండియన్ రెస్టారెంట్ల మోసం!

  • రూ. 3 కోట్లకు ఇన్వెస్టర్లను మోసగించాయని అధికారుల ఆరోపణ
  • వ్యాపార విస్తరణ పేరుతో పెట్టుబడిదారుల సొమ్ము ఖర్చు చేశాయని వెల్లడి
  • సొమ్ము రికవరీ కోసం స్థానిక కోర్టులో సెక్యూరిటీల సంస్థ కేసు
అమెరికాలోని కొలరాడో రాష్ర్టంలో రెండు భారతీయ రెస్టారెంట్లు పెట్టుబడిదారులను సుమారు రూ. 3.16 కోట్ల మేర నిండా ముంచినట్లు అధికారులు ఆరోపించారు. ఆ సొమ్మును రెస్టారెంట్ల నుంచి రికవర్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక కోర్టులో కొలరాడో డివిజన్ ఆఫ్ సెక్యూరిటీస్ కేసు వేసింది.

బాంబే క్లే ఓవెన్, సాసీ బాంబే అనే భారతీయ రెస్టారెంట్ల ఓనర్లు దేశవ్యాప్తంగా బిజినెస్ విస్తరిస్తామని అబద్ధాలు, అర్ధ సత్యాలు చెప్పి పెట్టుబడిదారులను మోసగించారని పిటిషన్ లో అధికారులు ఆరోపించారు. రెస్టారెంట్ల అద్దె, నిర్వహణ ఖర్చులు పోంజీ తరహా చెల్లింపుల కోసం షేర్ హోల్టర్లు పెట్టిన పెట్టుబడిని ఆ రెస్టారెంట్ల యజమానులు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు బిజినెస్ డెన్ అనే స్థానిక న్యూస్ పేపర్ బుధవారం కథనం ప్రచురించింది.

ఆ పత్రిక కథనం ప్రకారం ఈ రెండు రెస్టారెంట్లు ద బాంబే గ్రూప్ (టీబీజీ)కు చెందినవి. 2014లో టీబీజీ సొంతంగా బాంబే క్లే ఓవన్ ను వివిధ ప్రాంతాల్లో నడుపుతోంది. అలాగే మరో చోట సాసీ బాంబే రెస్టారెంట్ ను నిర్వహిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా వందలు లేదా వేల ప్రాంతాల్లో విస్తరించాలని ఆ కంపెనీ ప్రణాళికలు వేసుకుంది. ఇందులో భాగంగా సాసీ బాంబే రెస్టారెంట్ ను ఫ్రాంచైజీగా మార్చాలని అనుకుంది.

“ఈ కేసులో ద బాంబే గ్రూప్, దాని రెస్టారెంట్ సాసీ బాంబేను పెట్టుబడిదారులు నమ్మారు. కానీ పెట్టుబడుల గురించి వారికి యాజమాన్యం చెప్పకపోవడమే కాకుండా తిరిగి చెల్లించలేదు. ఒకవేళ మీరు బాంబే గ్రూప్ లో కనుక పెట్టుబడి పెట్టి ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి” అని ఆ పత్రికతో మాట్లాడుతూ కొలరాడో డివిజన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషనర్ టంగ్ చాన్ కోరారు.

ద బాంబే గ్రూప్ సెక్యూరిటీల బ్రోకర్ మైఖేల్ బిస్సనేట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు టీబీజీతోపాటు మైఖేల్ నిరాకరించారని బిజినెస్ డెన్ పేర్కొంది.


More Telugu News