ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

  • నాలుగు పరుగుల తేడాతో గెలుపు
  • 88 పరుగులతో రాణించిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్
  • గుజరాత్ బ్యాటర్లు మిల్లర్, సాయి సుదర్శన్ పోరాడినా దక్కని ఫలితం
కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన గెలుపును సొంతం చేసుకుంది. 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి, ఓటమిని చవిచూసింది. ఆ జట్టు బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్ అద్భుతమైన అర్ధ సెంచరీలతో పోరాడినా ఫలితం దక్కలేదు.

చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరమవ్వగా క్రీజులో ఉన్న రషీద్ ఖాన్ గుజరాత్‌ని గెలిపించినంత పని చేశాడు. కానీ 15 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా కేవలం 1 పరుగు వచ్చింది. దీంతో ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. డార్ సలామ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, అన్రిచ్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 43 బంతుల్లో 88 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. ఇక స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ 43 బంతుల్లో 66 పరుగులు కొట్టాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ భారీ స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో పృథ్వీ షా (11), జేక్ ఫ్రెసర్ (23), షెయ్ హోప్ (5), స్టబ్స్ (26) చొప్పున పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో వారియర్ 3 వికెట్లు సాధించగా.. నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.

కాగా ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకుంది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానానికి ఎగబాకింది. కాగా ఈ సీజన్‌లో ఐదవ ఓటమిని చవిచూసిన శుభ్‌మన్ గిల్ సారధ్యంలోని గుజరాత్ 7వ స్థానానికి దిగజారింది.


More Telugu News