పంత్ మాస్ కొట్టుడు... ఢిల్లీ భారీ స్కోరు

  • ఢిల్లీ క్యాపిటల్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 43 బంతుల్లో 88 పరుగులు చేసిన పంత్
  • ఆఖరి ఓవర్లో 4 సిక్స్ లు, 1 ఫోర్ బాదిన వైనం
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించింది. కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన హిట్టింగ్ తో సొంతగడ్డపై ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. 

పంత్, అక్షర్ పటేల్ అర్ధసెంచరీలు, ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 66 పరుగులు చేశాడు. ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చిన స్టబ్స్ కేవలం 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్ చూస్తే... హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ను ఓపెనర్ గా పంపారు. ధాటిగా ఆడిన మెక్ గుర్క్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 23 పరుగులు చేసి సందీప్ వారియర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 11 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన షాయ్ హోప్ కేవలం 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ దశలో పంత్, అక్షర్ పటేల్ జోడీ సెంచరీకి పైగా పరుగుల భాగస్వామ్యంతో స్కోరుబోర్డును ముందుకు ఉరికించింది. 

అక్షర్ పటేల్ అవుటైనప్పటికీ పంత్ దూకుడు కొనసాగించాడు. ముఖ్యంగా, మోహిత్ శర్మ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పంత్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 సిక్స్ లు, 1 ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ కు 1 వికెట్ లభించింది.


More Telugu News