రూ.65 కోట్లు ట్యాక్స్ కట్టేవాడ్ని... నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది?: పవన్ కల్యాణ్

  • నెల్లిమర్లలో వారాహి విజయభేరి-ప్రజాగళం సభ
  • హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు
  • వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం తనకు ఇష్టం లేదన్న పవన్
  • అన్ని వర్గాల వారు నలిగిపోతుంటే చూడలేక పొత్తు కుదుర్చుకున్నట్టు వెల్లడి
జగన్ సైకో పాత్ మాత్రమే కాదు సోషియో పాత్ కూడా... ఎవరు నవ్వినా, ఎవరు తెల్ల దుస్తులు వేసుకున్నా, ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేడు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి-ప్రజాగళం ఉమ్మడి ప్రచార సభకు చంద్రబాబుతో కలిసిన హాజరైన పవన్ కల్యాణ్... సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

తనకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదని, తానేమీ సరదాకు ఈ మాట అనడం లేదని స్పష్టం చేశారు. యువత, మహిళలు... ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే తనకు గానీ, చంద్రబాబుకు గానీ, ఏ రాజకీయనాయకుడికి గానీ ఏమీ జరగదని, కానీ ప్రజలకు నష్టం కలుగుతుంటే, అన్ని వర్గాలవారు నలిగిపోతుంటే చూడలేక పొత్తు కుదుర్చుకున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. 

ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావాలి అనే బలమైన సంకల్పంతో పొత్తు కుదుర్చుకున్నాం అని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నెల్లిమర్ల జూట్ మిల్ తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. 

"నాడు రామతీర్థం క్షేత్రంలో రాముడి తలను తీసేయడం చూశాక ఎంతో బాధ కలిగింది. ఏ దేవుడైనా కానీ, ఏ మందిరం అయినా కానీ... ఈ రోజుకీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మనంలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి... అప్పుడు తాను అధికారంలో ఉండొచ్చు... ఇది పోవాలి అంటే శాంతిభద్రతను కట్టుదిట్టంగా అమలు చేసే ప్రభుత్వం కావాలి. 

గత టీడీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై ఒక్క ఘటన కూడా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక 240 పైచిలుకు దుర్ఘటనలు జరిగాయి. ఎన్డీయే ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ను తీసుకువస్తుంది. 

చంద్రబాబు నాడు ఏ ప్రదేశంలో ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారో, అదే ప్రాంతంలో మళ్లీ శంకుస్థాపన చేసి భూముల రేట్లు పెంచారు. కానీ భూమి మిగల్లేదు, డబ్బులు రాలేదు. నాడు అమరావతికి 35 వేల ఎకరాలు కాదు 55 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి ఇవాళ మూడు రాజధానులు అంటున్నాడు. మరి ఈ రోజుకీ మనకు రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా, ఆ భూములు ఏమైపోయాయి అంటూ పోరాటం చేసినట్టు నటించాడు. 

నాడు చంద్రబాబు ఎయిర్ పోర్టు కోసం జీఎమ్మార్ సంస్థకు భూములిస్తే తప్పని చెప్పిన జగన్... ఇవాళ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ అంటూ అదే జీఎమ్మార్ సంస్థకు ఇచ్చాడు. ఇలాంటి తలతిక్క పనులను ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యచంద్రుగుప్తుల హయాంలో నవనందులు ఉండేవాళ్లు. తలతిక్క పనులు, హింస, దోపిడీలు ఇవన్నీ చేసేవాళ్లు. ఇప్పుడు ప్రజలందరూ చాణక్యచంద్రగుప్తుల్లా అవ్వాలి.. వ్యూహం పన్ని చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి... అప్పుడు గానీ ఈ వైసీపీ నవనందులను గద్దె దింపలేం. 

చాలా తక్కువ సమయం ఉంది మనకు. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్లపైకి వచ్చాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం, ఎప్పుడూ ఇంట్లోంచి బయటకు రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం... ప్రజల భవిష్యత్తు కోసమే ఇదంతా భరించాం. 

ఇవాళ జగన్ కు చిన్న గులకరాయి తగిలితే అది రాష్ట్రానికే తగిలిన దెబ్బ అన్నంతగా హంగామా చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో గొడ్డలివేటు గురించి అందరికీ తెలుసు... అది గాయం కాదు! బాలుడు అమర్నాథ్ ను చెరుకుతోటలోకి తీసుకెళ్లి దహనం చేసినప్పుడు మన మనసులు గాయపడవు, రాములవారి విగ్రహం కిందపడినా మా మనోభావాలు గాయపడవు, ఇతడికి గులకరాయి తగిలితే మాత్రం రాష్ట్రమంతా కదిలిపోవాలి. 

నిన్న నా అఫిడవిట్ చూశారు. దాదాపు రూ.65 కోట్లు ట్యాక్స్ కట్టాను... నా సత్తా ఎంతో చూడండి. అంత ట్యాక్స్ కట్టేవాడ్ని నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? కానీ మీ కన్నీరు ఒక చుక్క తుడవగలిగితే నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. 

ఈ ముఖ్యమంత్రి లేస్తే క్లాస్ వార్ అంటూ మాట్లాడతాడు. చంద్రబాబు గారు, నేను పేదలను దోచేస్తామంట. కౌలు రైతులకు అండగా నిలిచేందుకు కోట్ల రూపాయలు ఇచ్చినవాడ్ని నేను. నేను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇచ్చినవాడ్ని... పేదల పొట్టకొట్టాల్సిన అవసరం నాకేముంది? 

చంద్రబాబు ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. హైటెక్ సిటీ నిర్మించి బలమైన పునాది వేసిన వ్యక్తి... 2000 సంవత్సరంలో విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. జగన్ లాగా ఆయనకు కూడా ఆశలు ఉంటే ఈ రోజు ఆయనకు ఎన్ని లక్షల కోట్లు ఉండేవో! కానీ ఆయన అలాంటివేవీ పెట్టుకోలేదు. 

నాకు, చంద్రబాబుకు మధ్య కొన్ని విభేదాలు ఉంటాయి... అయితే అవి విధానాలపైనే. నేను ఏదైనా పాలసీ గురించి చెబితే చంద్రబాబు గారు కొన్ని సూచనలు చెప్పి సరిచేస్తారు. కానీ జగన్ అలా కాదు... అడ్డగోలుగా దోచేసే వ్యక్తి" అంటూ పవన్ ప్రసంగించారు.


More Telugu News