ఎక్స్ టీవీ యాప్... యూట్యూబ్ కు పోటీగా సరికొత్త వేదిక

  • యూట్యూబ్ కు పోటీగా ఎక్స్ నుంచి కొత్త ప్లాట్ ఫాం
  • స్మార్ట్ టీవీల్లో వీక్షించేందుకు అనువైన యాప్
  • ప్రస్తుతం రూపుదిద్దుకునే దశలో ఎక్స్ టీవీ యాప్
కొన్నాళ్ల కిందట ట్విట్టర్ ను సొంతం చేసుకుని దాని పేరును ఎక్స్ గా మార్చేసిన ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్... ఇప్పుడు యూట్యూబ్ కు దీటుగా యాప్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని పేరు ఎక్స్ టీవీ యాప్. ఇది స్మార్ట్ టీవీల్లో వీక్షించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. యూట్యూబ్ లాగా దీంట్లో కూడా యూజర్లు వీడియోలు అప్ లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ తరహాలోనే వీడియోలను సెర్చ్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.

ఎక్స్ సీఈవో లిండా యాకరినో దీనికి సంబంధించిన అప్ డేట్ ను పంచుకున్నారు. "సరికొత్త పంథాలో, ఆకట్టుకునే కంటెంట్ ను త్వరలోనే మీ స్మార్ట్ టీవీల్లోకి తీసుకువస్తున్నాం. మా ఎక్స్ టీవీ యాప్ భారీ స్క్రీన్లపై హై క్వాలిటీ కంటెంట్ ను అందిస్తుంది. ఈ కంటెంట్ తో మీరు లీనమైపోతారు. చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు ఎక్స్ ప్రతిదీ మార్చేస్తోంది... ప్రస్తుతం ఎక్స్ టీవీ యాప్ రూపుదిద్దుకున దశలో ఉంది" అంటూ లిండా యాకరినో ఓ వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు.


More Telugu News