పరువు తీయడానికే పద్మారావును కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి నిలబెట్టారు: రేవంత్ రెడ్డి

  • పద్మారావు నామినేషన్ దాఖలుకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? అన్న రేవంత్ రెడ్డి 
  • సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారని బీఆర్ఎస్‌పై విమర్శ
  • సికింద్రాబాద్‌లో గెలిచే పార్టీ అధికారంలోకి వస్తుందన్న రేవంత్ రెడ్డి
పద్మారావు పరువు తీయడానికే అతడిని కేసీఆర్ సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పద్మారావు నామినేషన్ దాఖలుకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. దీనిని బట్టే ఆయనకు వాళ్లు మద్దతివ్వడం లేదని అర్థమవుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బుధవారం సీఎం సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ... సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మంచి వ్యక్తి అని... కానీ కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్లే అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? అని నిలదీశారు. దానం నాగేందర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి పదవి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. మతసామరస్యాన్ని కాపాడింది తామేనన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీనదిలో వేసినట్లేనని ఓటర్లకు సూచించారు. బీజేపీ నిత్యం రాముడి పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. కానీ భక్తి గుండెల్లో ఉండాలి... దేవుడు గుడిలో ఉండాలన్నారు. ప్రధాని మోదీ... దేవుడిని బజారుకు తీసుకు వచ్చారని విమర్శించారు. మతచిచ్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు.


More Telugu News