ట్రోల‌ర్స్‌కు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన ప్రాచీ నిగ‌మ్‌..!

  • ఉత్త‌రప్ర‌దేశ్ 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫ‌స్ట్ వ‌చ్చిన ప్రాచీ నిగమ్
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ప్రాచీ నిగమ్ ఫొటో
  • ఆమె అందంగా లేదంటూ కొంద‌రి విమ‌ర్శ
  • ప్రాచీ ముఖంపై అవాంఛిత రోమాలుండ‌డ‌మే ఆమెపై ట్రోలింగ్‌కు కార‌ణం
  • అంతిమంగా ముఖ్యమైనది నా మార్కులే తప్ప నా ముఖంపై వెంట్రుకలు కాదంటూ అదిరిపోయే రిప్లై

ఇటీవ‌ల విడుద‌లైన ఉత్త‌రప్ర‌దేశ్ 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫ‌స్ట్ వ‌చ్చిన ప్రాచీ నిగమ్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 600ల‌కు గాను 591 మార్కులు సాధించి, 98.5 శాతంతో టాప‌ర్‌గా నిలిచింది. కానీ, ఆమె ప్ర‌తిభ‌ను ప్ర‌శంసించ‌డానికి బ‌దులు కొంద‌రు ఆమె అందంగా లేదంటూ విమ‌ర్శించారు. ప్రాచీ ముఖంపై అవాంఛిత రోమాలుండ‌డ‌మే ఆమెపై ట్రోలింగ్‌కు కార‌ణం. ఈ బాడీ షేమింగ్ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  

అయితే, తన ముఖంపై అవాంఛిత‌ వెంట్రుకలపై ట్రోల్ చేస్తున్న ట్రోలర్లపై ప్రాచీ నిగ‌మ్‌ ఎట్టకేలకు స్పందించింది. "ట్రోలర్లు వారి ఆలోచనలతో వారు ఉంటారు. నా విజయం ప‌ట్ల నేను ఆనందంగా ఉన్నాను. నా విజ‌యం వ‌ల్ల‌ నాకు ఇప్పుడు ద‌క్కిన‌  గుర్తింపుతో సంతోషంగా ఉన్నాను" అని ఆమె బుధవారం అన్నారు. 

ఇంకా ప్రాచీ నిగ‌మ్ మాట్లాడుతూ.. "నా కుటుంబం, నా ఉపాధ్యాయులు, నా స్నేహితులు నా రూపాన్ని ఎన్నడూ విమర్శించింది లేదు. దాని గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల తర్వాత నా ఫొటో ప్రచురితమైనప్పుడు మాత్రమే కొంద‌రు నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆపై నా దృష్టి ఈ సమస్యపైకి మళ్లింది. ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. అంతిమంగా ముఖ్యమైనది నా మార్కులే తప్ప నా ముఖం మీద వెంట్రుకలు కాదు" అని ఆమె చెప్పుకొచ్చారు.

మ‌రోవైపు భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రాచీకి మద్దతుగా నిలిచారు. ఈ సంద‌ర్భంగా ఆమెను విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాల‌ని స‌ల‌హా ఇవ్వ‌డం జ‌రిగింది. ఇదిలాఉంటే.. ప్రాచీ నిగ‌మ్‌కి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐఎంఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్‌కే ధీమాన్ త‌మ‌ ఇన్‌స్టిట్యూట్ ఉచితంగా చికిత్స చేయనున్నట్లు వెల్ల‌డించారు.

"హార్మోన్ల ప్ర‌భావం కార‌ణంగా ప్రాచీ ముఖంపై వ‌స్తున్న‌ అవాంఛిత రోమాల పెరుగుద‌ల‌ను ఎండోక్రినాలజీ ద్వారా నియంత్రించ‌వ‌చ్చు.  8-16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో ఈ స‌మ‌స్య కామ‌న్‌. నెలరోజుల్లోనే నయం అవుతుంది" అని ఆర్‌కే ధీమాన్ అన్నారు.


More Telugu News