ప్రపంచ టీకాల వారోత్సవం: శిశువులు, చిన్నారులకు ఇవ్వాల్సిన 5 ముఖ్యమైన టీకాలివే
- నేటి నుంచి ఈ నెల 30 వరకు ప్రపంచ టీకాల వారోత్సవం
- టీకాల ప్రాధాన్యతపై ప్రచారం కోసం ఏటా చివరి ఏప్రిల్ వారంలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుతున్న వ్యాక్సిన్లు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులకు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా టీకాలు కాపాడుతున్నాయి. టీకాల ప్రాధన్యాత గురించి ప్రచారం కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఏటా ఏప్రిల్ చివరి వారంలో ప్రపంచ టీకా వారోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 24 అంటే గురువారం నుంచి ఈ నెల 30 వరకు టీకాల వారోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కచ్చితంగా తమ చిన్నారులకు ఇప్పించాల్సిన ఐదు ముఖ్యమైన టీకాల గురించి క్లుప్తంగా..
1. ఎంఎంఆర్ టీకా
ఈ టీకా మూడు ప్రమాదకర అంటవ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. అవి తట్టు, గవదబిళ్లలు, రూబెల్లా (జర్మనీ తట్టు). వీటిలో తట్టు అత్యంత ప్రమాదకరమైనది. ఇది పిల్లల్లో నిమోనియా, మెదడువాపుకు దారితీస్తుంది. గవదబిళ్లలు చెవుడుకు దారితీస్తుంది. మెనింజైటిస్ మెదడు, వెన్నెముక వాపునకు దారితీస్తుంది. రూబెల్లా వ్యాధి వల్ల శిశువులు పుట్టుకతోనే లోపాలతో పుడతారు. ఎంఎంఆర్ టీవా ఈ వ్యాధుల నుంచి రక్షణ అందిస్తుంది.
2. పోలియో టీకా
పోలియో అనే వైరస్ శిశువుల కాళ్లు, చేతులు చచ్చుబడేలా చేస్తుంది. కొందరిలో మరణానికి దారితీస్తుంది. దీని నివారణకు నోట్లో చుక్కల రూపంలో పోలియో టీకాను పిల్లలకు ఇప్పించాలి.
3. డీటీఏపీ టీకా
డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు అనేవి పిల్లలకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ద్వారా సోకుతాయి. డిఫ్తీరియా తీవ్ర శ్వాసకోస సమస్యలు, గుండె వైఫల్యం కలిగిస్తుంది. ధనుర్వాతం నరాలు బిగుసుకుపోవడానికి దారితీస్తుంది. కోరింత దగ్గు చిన్నారుల్లో దీర్ఘకాల దగ్గు, శ్వాసకోస సమస్యలకు కారణమవుతుంది. డీటీఏపీ టీకా ద్వారా ఈ మూడు వ్యాధులు చిన్నారులకు సోకకుండా నివారించొచ్చు.
4. హీమోఫైలస్ ఇన్ఫ్లుయెంజే టైప్ బీ టీకా
ఇదో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. చిన్నారుల్లో నిమోనియా, మెదడు, వెన్నెముక వాపు, ఆహారం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా మింగేటప్పుడు శ్వాసనాళాన్ని కప్పి ఉంచే మూత (ఎపిగ్లాటిస్)కు సోకే వాపు కలిగిస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే చిన్నారులు మరణించే అవకాశం కూడా ఉంటుంది. హెచ్ఐబీ టీకా ఈ వ్యాధి బారి నుంచి పిల్లలను కాపాడుతుంది.
5. హెపటైటిస్ బీ టీకా
కాలేయాన్ని దెబ్బతీసే వైరల్ వ్యాధి ఇది. సకాలంలో వైద్యం అందకపోతే కాలేయ వ్యాధి, కాలేయ క్యాన్సర్, మరణానికి కూడా దారితీస్తుంది. శిశువులు, చిన్నారుల్లో హెపటైటిస్ బీ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ టీకాతో చిన్నారులకు ఈ వ్యాధి సోకకుండా కాపాడొచ్చు.