'సితార' రిలీజ్ చేస్తే 'శంకరాభరణం'తో వచ్చిన పేరు పోతుందనుకున్నారు: దర్శకుడు వంశీ

  • వంశీ సినిమాల్లో 'సితార' స్థానం ప్రత్యేకం 
  • ఆ సినిమా చూసి నిర్మాత ఏమీ మాట్లాడలేదని వెల్లడి 
  • ఇళయరాజాను చూసి భయపడ్డానని వ్యాఖ్య 
  • ఆయన మెచ్చుకోవడంతో ప్రాణం లేచొచ్చిందని వివరణ   

దర్శకుడు వంశీ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం లేదు. దాంతో ఆయన అందించిన ఆణిముత్యాలనే అభిమానులు ఆస్వాదిస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీ ఆనాటి ముచ్చట్లను యూ ట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటూ వెళుతున్నారు. అలా ఆయన 'సితార' థియేటర్లకు రావడానికి ముందు జరిగిన సంగతులను ప్రస్తావించారు.

'సితార' సినిమాకి సంబంధించిన పాటలను ఇంకా ఎడిట్ చేయలేదు. అయినా సినిమాను ఓ సారి చూద్దామని ఏడిద నాగేశ్వరావుగారు అన్నారు. 'సురేశ్ మహల్'లో ఆ సినిమాను వేశాము. పాటలు లేవు .. కామెడీ లేదు .. దాంతో అందరూ అసహనంతో కదులుతున్నారు. సినిమా అయిపోయిన తరువాత ఏడిద నాగేశ్వరరావుగారు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇంటి దగ్గర ఏమైనా చెబుతారేమోనని అక్కడికి వెళ్లాను. 

'అయితే నీకూ సినిమా నచ్చలేదా?' అని నాగేశ్వరరావుగారు భార్యతో అంటున్నారు. 'నాకే కాదు .. మన పనిపిల్లకి కూడా నచ్చలేదు. 'అమ్మగారూ ఇంటికి ఎప్పుడు వెళదాం' అని నాలుగు సార్లు అడిగింది'. ఈ సినిమాను మనం రిలీజ్ చేస్తే 'శంకరాభరణం' సినిమాతో మనకి వచ్చిన పేరు మొత్తం మట్టికొట్టుకు పోతుంది" అని ఆమె చెబుతున్నారు. ఆ తరువాత ఇళయరాజాగారు ఆ సినిమా చూశారు. 'చాలా బాగా తీశావయ్యా' అంటూ ఆయన మెచ్చుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు .. నాకేమో ప్రాణం లేచొచ్చింది" అని చెప్పారు. 


More Telugu News