రేపు పులివెందులలో జగన్ నామినేషన్.. దస్తగిరికి భద్రత పెంపు

  • రేపు రెండో సెట్ నామినేషన్ వేయనున్న జగన్
  • జైభీమ్ భారత్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న దస్తగిరి
  • వైసీపీ శ్రేణులు దాడి చేయాలని కుట్ర చేస్తున్నారన్న దస్తగిరి
వైసీపీ అధినేత జగన్ రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11.25 గంటల నుంచి 11.40 గంటల మధ్య ఆయన నామినేషన్ వేస్తారు. 22వ తేదీన జగన్ తరపున ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు జగన్ రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు పులివెందులలో వైసీపీ ఏర్పాటు చేసే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. 

మరోవైపు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. జైభీమ్ భారత్ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనను జగన్, అవినాశ్ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. 

ఇంకోవైపు, నామినేషన్ నేపథ్యంలో దస్తగిరికి భద్రత పెంచారు. ఈరోజు, రేపు ఆయనకు అధిక భద్రతను కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న 3 ప్లస్ 3, 4 ప్లస్ 4 నుంచి.... 4 ప్లస్  4, 10 ప్లస్ 10కు భద్రతను  పెంచారు.


More Telugu News