ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో ఢిల్లీలో నిరసనలు!

  • ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన
  • పంటలకు మద్దతు ధర, నదుల అనుసంధానం డిమాండ్ చేసిన వైనం
  • ప్రభుత్వం తమ మొర ఆలకించకపోతే వారణాసి నుంచి ప్రధానిపై పోటీ చేస్తామని హెచ్చరిక
  • తాము ఏ పార్టీకీ వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు పంటలకు మద్దతు ధర కోరుతూ నిరసనకు దిగారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కపాలాలు, ఎముకలతో వారు నిరసన తెలిపారు. నదుల అనుసంధానం కూడా జరగలేదని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2019లో ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఆచరణలోకి తీసుకురాలేకపోయిందని నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను మండిపడ్డారు. 

తమ డిమాండ్లను ప్రభుత్వం బేఖాతరు చేస్తే వారణాసిలో ప్రధానిపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని రైతులు హెచ్చరించారు. ‘‘ప్రభుత్వం మా మాట వినకపోతే మేము వారణాసి వెళ్లి ఎన్నికల్లో మోదీపై పోటీ చేస్తాం. గతంలో మా డిమాండ్ల సాధనకు నిరసన చేశాం. మేము మోదీ లేదా ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు. మోదీ సాయం కావాలని మాత్రమే కోరుతున్నాం. మనం ఓ ప్రజాస్వామిక దేశంలో జీవిస్తున్నాం. నిరసన తెలిపే హక్కు మనందరికీ ఉంది. కానీ పోలీసులు మొదట మమ్మల్ని అడ్డుకున్నారు. అయితే, కోర్టు జోక్యంతో అనుమతి లభించింది’’ అని వారు తెలిపారు.


More Telugu News