మార్కస్ స్టొయినిస్ ఆల్‌టైమ్ రికార్డు.. చెన్నైపై లక్నో అద్భుత విజయం

  • 211 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఛేదించిన లక్నో సూపర్ జెయింట్స్
  • 124 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టొయినిస్ 
  • ఐపీఎల్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు
భారీ లక్ష్య ఛేదనలో మార్కస్ స్టొయినిస్ రికార్డు స్థాయి శతకం బాదడంతో ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ మరో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుత ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుని సొంత మైదానంలో ఓడించిన తొలి జట్టుగా అవతరించింది. చెన్నై నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఘన విజయం  సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో మార్కస్ స్టొయినిస్ వీరోచిత పోరాటం చేశాడు. కేవలం 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులు బాదాడు. అవతలి వైపు సహచర ఆటగాళ్ల సహకారం పెద్దగా లేనప్పటికీ సిక్సర్లు, ఫోర్లతో తన జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. స్టొయినిస్ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి. కాగా స్టొయినిస్ సాధించిన 124 పరుగులు ఐపీఎల్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదయింది. లక్నో మిగతా బ్యాటర్లలో డికాక్ (0), కేఎల్ రాహుల్ (16), పడిక్కల్ (13), నికోలస్ పూరన్ (34), దీపక్ హుడా (17) చొప్పున పరుగులు చేశారు. ఇక చైన్నై బౌలర్లలో పతిరణ 2 వికెట్లు, దీపక్ చాహర్, ముస్తాఫీజుర్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లో 108 పరుగులు బాదాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే కేవలం 27 బంతుల్లో 66 పరుగులు కొట్టి భారీ స్కోరు సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. చివరిలో వచ్చిన ధోనీ తాను ఎదుర్కొన్న ఏకైక బంతిని బౌండరీ తరలించాడు. అంతేకాదు ఈ మైదానంలో అత్యధిక లక్ష్య ఛేదన కూడా ఇదే కావడం గమనార్హం. అంతకుముందు 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఐపీఎల్ లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోర్లు..
1. మార్కస్ స్టొయినిస్ 124 ( 2024)
2. పాల్ వాల్తాటి - 120 (2011)
3. వీరేంద్ర సెహ్వాగ్ -119 ( 2011)
4. సంజు శాంసన్ -119 (2021)
5. షేన్ వాట్సన్ -117* (2018)


More Telugu News