రేవంత్ రెడ్డికి నాపై ఆ కక్ష ఉంది... 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: టీవీ 9 ఇంటర్వ్యూలో కేసీఆర్

  • ఓటుకు నోటు కేసు తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఏమి ఉంటుందన్న కేసీఆర్
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా
  • ప్రభుత్వం కూలిపోతుందంటే రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదన్న కేసీఆర్
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని మా వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని వ్యాఖ్య
ఓటుకు నోటు కేసు తప్ప తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకేం కక్ష ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 2015లో ఓటుకు నోటు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని తెలిపారు. తనపై రేవంత్ రెడ్డికి అదే కక్ష ఉందన్నారు. మంగళవారం నాడు టీవీ9లో 'లైవ్ షో విత్ కేసీఆర్' కార్యక్రమంలో ఆయన ఓటుకు నోటు కేసు అంశంపై స్పందించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఈసారి గెలిస్తే ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా తొలి ఇంటర్వ్యూను మీకే ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు భ్రమలో పడి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లు తమ రివ్యూలో తేలిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదన్నారు. బీఆర్ఎస్ 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి సున్నా నుంచి 1 స్థానాలు మాత్రమే వస్తాయన్నారు.

కడియం శ్రీహరి పార్టీ మారడంపై కూడా కేసీఆర్ స్పందించారు. కడియం శ్రీహరి తాను చచ్చి బీఆర్ఎస్‌ను బతికించారని వ్యాఖ్యానించారు. ఆయన ఖర్మ బాగాలేక కాంగ్రెస్‌లోకి వెళ్లారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని స్వేచ్ఛ... అధికారం పోయాక కడియం శ్రీహరికి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మహా సముద్రమని... పిడికెడు మంది పోతే పోయేదేం లేదన్నారు. తాను రాజకీయ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపానని... అందుకే ఇక ఫక్తు రాజకీయాలు చేస్తామని 2014కు ముందే చెప్పామని గుర్తు చేశారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లలో కొంతమంది తనకు ఫోన్ చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బయట పలువురు చెబుతుంటే రేవంత్ రెడ్డి ఖండించడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే చాలా అనిశ్చితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ నేతలను సంప్రదిస్తున్నారని తెలిపారు. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నట్లు తమకు చెబుతున్నారన్నారు. మనమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మా వాళ్లతో ఆ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కానీ తాము మాత్రం ఆ విషయంపై ఇంకా చర్చించలేదన్నారు.


More Telugu News