ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిగా నాది కేవలం వ్యూహమే... నాకేమీ ఇంజినీరింగ్ భాష తెలియదు: టీవీ 9 ఇంటర్వ్యూలో కేసీఆర్

  • కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కేసీఆర్ దేనని కాంగ్రెస్ నాయకులు చెప్పడం మూర్ఖత్వమేనని వ్యాఖ్య
  • సమైక్య పాలనలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదన్న కేసీఆర్
  • అసలు రేవంత్ రెడ్డిని లెక్కలోకే తీసుకోనన్న బీఆర్ఎస్ అధినేత
తెలంగాణలో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిగా తనది కేవలం వ్యూహం మాత్రమేనని... తనకు ఇంజినీరింగ్ భాష తెలియదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కేసీఆర్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పడం మూర్ఖత్వమే అన్నారు. మంగళవారం టీవీ9లో 'లైవ్ షో విత్ కేసీఆర్' కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ... సమైక్య పాలనలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శించారు. మైనర్ ఇరిగేషన్ ధ్వంసమైందన్నారు.

భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయన్నారు. కానీ తాము వచ్చాక అన్నింటిని సరిదిద్దే ప్రయత్నం చేశామన్నారు. ఎత్తులో ఉన్న తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే దిక్కు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థులు.. అర్భకులు కాంగ్రెస్ వాళ్లు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. మేడిగడ్డ మూడు పిల్లర్లలో ఒక బ్లాక్‌లోని ఇబ్బందిని కాంగ్రెస్ వారు పెద్దదిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో టన్నెల్స్, పంప్ హౌజ్‌లు అన్నీ బాగానే ఉన్నట్లు చెప్పారు.

పిల్లర్ కుంగినట్లు ఎన్నికలకు ముందే తెలుసునని... అందుకే బాగు చేయాలని అధికారులను కూడా ఆదేశించానన్నారు. కానీ ఇప్పుడు తనను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయించకపోయినా ఏం కాదన్నారు. కాళేశ్వరం కెపాసిటీ 16 టీఎంసీలేనని తెలిపారు. ఎండాకాలంలో రెండో పంటకు, సాగునీటికి కాళేశ్వరం కీలకమన్నారు.

రేవంత్ రెడ్డిని లెక్కలోకి తీసుకోను

ప్రస్తుతం తెలంగాణలో అంతా దేవుళ్ల మీద ఒట్లు... కేసీఆర్ మీద తిట్లు నడుస్తున్నాయని కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తమ పార్టీలో కూడా కొన్నాళ్లు ఉన్నారని... కానీ ఆయన పాలనలో అహంకారం, అజ్ఞానపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తామని ఆయన చెబుతున్నారని.. కానీ అది అసాధ్యమన్నారు. అలాంటి ఆలోచనే వికృతమైందన్నారు. అసలు రేవంత్ రెడ్డి తనపై చేసే దాడిని తాను లెక్కలోకే తీసుకోనని తెలిపారు. ఎవరికైనా రాజకీయంగా టైమ్ వస్తుందన్నారు.

ఉద్యమం సమయంలో తాను ఆంధ్రాకు వ్యతిరేకమని చాలామంది అనుకున్నారని... కానీ బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాధపడలేదని పేర్కొన్నారు. తెలంగాణ మీద.. వనరుల మీద.. ఉద్యోగాల మీద తెలంగాణ వారికే అవకాశం ఉండాలని మాత్రమే అనుకున్నామని... అది సాధించామన్నారు. కానీ వికృతమైన వ్యతిరేక భావనతో తాము మనుషుల మధ్య గోడ కట్టలేదన్నారు.


More Telugu News