బొత్స దోచిందెంత.. జగన్ కు రావాల్సిన వాటా ఎంత అనేది ఈరోజు తేల్చుకుంటారు: పట్టాభి

  • మళ్లీ వైసీపీ రాదనే విషయం జగన్ కు అర్థమయిందన్న పట్టాభి
  • అందుకే రాష్ట్రమంతా చివరిసారిగా తిరుగుతున్నారని ఎద్దేవా
  • దోపిడీ, వినాశనం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శ
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదనే విషయం జగన్ కు అర్థమయిందని... అందుకే రాష్ట్రమంతా చివరిసారిగా తిరుగుతున్నారని అన్నారు. అవినీతి లెక్కలు చూసుకోవడానికే మేమంతా సిద్ధం పేరుతో ఆయన జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఏం చేశారో చెప్పుకోవడానికి జగన్ చేసిందేముందని ప్రశ్నించారు. ఇది తన ప్రశ్న మాత్రమే కాదని... రాష్ట్ర ప్రజలందరిలో ఇదే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. 

అంతులేని దోపిడీ, వినాశనం తప్ప జగన్ చేసిందేమీ లేదని పట్టాభి మండిపడ్డారు. గత ఐదేళ్లగా ప్రతి జిల్లాను దోచుకున్నారని విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి... నాసిరకం మద్యం అమ్ముతూ వేల కోట్ల రూపాయలను దోపిడీ చేశారని అన్నారు. విజయనగరం జిల్లాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని చెప్పారు. బొత్స కుటుంబం దోచిందెంత... జగన్ కు రావాల్సిన వాటా ఎంత అనేది ఈనాటి విజయనగరం జిల్లా పర్యటనలో తేల్చుకుంటారని అన్నారు. ఇలాంటి వాటాలు తేల్చుకోవడానికే అన్ని జిల్లాల్లో జగన్ పర్యటిస్తున్నారని చెప్పారు.   

దోచుకోవడానికి ఇంకా ఏం మిగిలిందా? అని చూసుకోవడానికి జగన్ తిరుగుతున్నారని పట్టాభి మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. వేల కోట్లు దోచుకుని, దాచుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.


More Telugu News