పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్

  • పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న పవన్
  • చేబ్రోలు నుంచి భారీ ర్యాలీతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరిక
  • రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని 
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన పవన్ కల్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. 

నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోలు తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. 

కాగా, పవన్ నామినేషన్ ర్యాలీలో మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. 

నామినేషన్ వేసేందుకు బయల్దేరే ముందు పవన్... తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా, నామినేషన్ వేయడానికి వెళుతున్న పవన్ కల్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అర్ధాంగి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. వర్మ... పవన్ కు శాలువా కప్పారు.


More Telugu News