టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెన‌ర్లుగా దాదా ఛాయిస్ ఎవ‌రంటే..!

  • విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత్‌కు ఓపెనింగ్ చేయాల‌న్న‌ సౌరవ్ గంగూలీ
  • ప్ర‌స్తుతం వారు ఉన్న ఫామ్ దృష్ట్యా ఓపెన‌ర్లుగా క‌రెక్ట్‌గా స‌రిపోతార‌న్న భార‌త మాజీ కెప్టెన్‌
  • ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్‌
ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలలో జ‌రిగే టీ20 ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియాకు ఓపెనింగ్ చేయాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఈ ఇద్ద‌రూ భార‌త జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్లు కావ‌డంతో పాటు ప్ర‌స్తుతం వారు ఉన్న ఫామ్ దృష్ట్యా ఓపెన‌ర్లుగా క‌రెక్ట్‌గా స‌రిపోతార‌ని దాదా అభిప్రాయ‌ప‌డ్డాడు. వీరిద్ద‌రూ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వారి జట్టుల కోసం గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్నార‌ని తెలిపాడు. ఇక టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక దాదాపు అయిపోయి ఉండాల‌ని, ఇప్ప‌టికే సెల‌క్ట‌ర్లు టీమ్‌లో ఎవ‌రు ఉండాల‌నే విష‌య‌మై ఒక అంచ‌నాకు వ‌చ్చి ఉంటార‌ని చెప్పుకొచ్చాడు. 

పీటీఐతో గంగూలీ మాట్లాడుతూ.. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్, కోహ్లీ ఇద్దరూ క‌చ్చితంగా జ‌ట్టులో ఉంటారని, వీరిద్దరూ టోర్నమెంట్‌లో జట్టు కోసం ఓపెనింగ్ చేస్తే బాగుంటుంద‌ని గంగూలీ చెప్పాడు. “రోహిత్ శర్మ, విరాల్ కోహ్లీ ఇద్దరూ క‌చ్చితంగా వెస్టిండీస్, యూఎస్ఏకు వెళ్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక‌ సెలెక్టర్లు టోర్నీలో ఎవరితో ఓపెనింగ్ చేయిస్తార‌నేది వాళ్ల ఛాయిస్‌. కానీ నన్ను వ్యక్తిగతంగా అడిగితే మాత్రం రోహిత్, విరాట్ ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఓపెనింగ్ చేయాలి” అని గంగూలీ అన్నాడు.

ఇక టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా సౌర‌వ్‌ గంగూలీ ఈ ఇద్దరికీ మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు . ఈ ఏడాది ప్రారంభంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ జట్టుకు రోహిత్ శ‌ర్మ‌ కెప్టెన్‌గా ఉండాలని, అలాగే టీమ్‌లో విరాట్‌ కోహ్లీ త‌ప్ప‌కుండా ఉండాలని చెప్పాడు.

ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో కోహ్లీ, రోహిత్ ప్ర‌ద‌ర్శ‌న ఇలా..
విరాట్‌ కోహ్లీ (ఆర్‌సీబీ), రోహిత్ శ‌ర్మ (ఎంఐ) ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ, ఆయా జట్లు మాత్రం రాణించ‌డం లేదు. ఈ సీజన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 63.17 సగటుతో 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే ఈ సీజన్‌లో ర‌న్‌మెషిన్‌ 150 కంటే ఎక్కువ స్ట్రయిక్ రేట్‌ను క‌లిగి ఉండ‌డం విశేషం. అటు హిట్‌మ్యాన్‌ రోహిత్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు.


More Telugu News