తోట త్రిమూర్తులుకు ఎదురుదెబ్బ... ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

  • 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో ఇటీవల తీర్పు 
  • వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరో ఎనిమిది మందికి జైలు శిక్ష
  • ట్రయల్ కోర్టును తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన త్రిమూర్తులు
  • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు... ప్రతివాదులకు నోటీసులు
దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ఎనిమిది మందికి కూడా కోర్టు ఇదే తరహా శిక్ష విధించింది. 

కాగా, ట్రయల్ కోర్టు తీర్పుపై తోట త్రిమూర్తులు, మరో ఎనిమిది మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ పిటిషన్ల విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... విశాఖ ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. 

వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు ఈసారి ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో సరిగ్గా ఎన్నికల ముందే తీర్పు వెలువడడం ఆయనకు తలనొప్పిగా మారింది. 

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో శిక్ష పడినవారి నామినేషన్లు చెల్లుబాటు అవుతాయా, లేదా అనే అంశంపై వైసీపీ నాయకత్వం చర్చిస్తోంది. నామినేషన్ల గడువు ఈ నెల 25తో ముగియనుంది. 

ఈ నేపథ్యంలో, మండపేటలో అభ్యర్థిత్వాన్ని మార్చే అంశం కూడా వైసీపీ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తోట త్రిమూర్తులును తప్పించి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అవకాశం ఇచ్చే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.


More Telugu News