బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!

  • బ్యాంకాక్ నుంచి స్మగ్లింగ్ చేసే ప్రయత్నంలో దొరికిపోయిన వైనం
  • అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న కస్టమ్స్ అధికారులు
  • ‘ఎక్స్’లో అనకొండల ఫొటోలతో పోస్ట్.. అవాక్కయిన నెటిజన్లు


బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరినీ షాక్ కు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. అనకొండలను స్మగ్లింగ్ చేయబోతూ ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ విమాన ప్యాసింజర్ బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో ఏకంగా 10 పసుపు రంగు అనకొండలు బయటపడ్డాయి. ఓ సూట్ కేసును తెరవగా అందులో తెల్ల కవర్లలో చుట్టిన అనకొండలు కనిపించాయి.

దీంతో నిందితుడిని అరెస్టు చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న అనకొండల ఫొటోలను షేర్ చేశారు. వన్యప్రాణుల స్మగ్లింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

భారతీయ చట్టాల ప్రకారం వన్యప్రాణులతో వ్యాపారం చేయడం చట్ట విరుద్ధం. వన్యప్రాణుల స్మగ్లింగ్ ను నిరోధించడానికి కస్టమ్స్ యాక్ట్ 1962లో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఈ ఉదంతం సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్యాంకాక్ ప్రయాణికుడి చర్యను చాలా మంది నెటిజన్లు  తప్పుబట్టారు.


More Telugu News