సింగపూర్‌లో ‘ఎవరెస్ట్ ఫుడ్స్’ మసాలపై నిషేధమంటూ వార్తలు.. స్పందించిన కంపెనీ

  • నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చిన ఎవరెస్ట్ కంపెనీ
  • సింగపూర్‌లో ఒక ఉత్పత్తిని రీకాల్ చేశారని స్పష్టత
  • ఎండీహెచ్, ఎవరెస్ట్‌‌కు చెందిన పలు ఉత్పత్తులపై సింగపూర్, హాంకాంగ్‌లలో నిషేధం విధించారంటూ సోమవారం వెలువడ్డ కథనాలు
మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు.. భారతీయ ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ ఫుడ్స్‌కి చెందిన పలు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించిందంటూ వస్తున్న వార్తలపై ఎవరెస్ట్ ఫుడ్స్ స్పందించింది. తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించలేదని వివరణ ఇచ్చింది. సింగపూర్‌లో 1 ఉత్పత్తిని రీకాల్ చేశారని పేర్కొంది. ఎవరెస్ట్‌ ఉత్పత్తులను ఏ దేశంలోనూ నిషేధించలేదని పేర్కొంది. హాంకాంగ్ నిర్ణయం నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ఒక ఉత్పత్తిని రీకాల్‌ చేసిందని పేర్కొన్నారు. రీకాల్ చేసిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని తమ సింగపూర్ దిగుమతిదారుని ఆ దేశ ప్రభుత్వం కోరిందన్నారు.

కంపెనీకి చెందిన 60 ఉత్పత్తులల్లో కేవలం దానిని మాత్రమే రీకాల్ చేశారని వివరించింది. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, అధిక నాణ్యత కలిగినవని ఈ సందర్భంగా వినియోగదారులకు ఎవరెస్ట్ కంపెనీ హామీ ఇచ్చింది. కాగా ఎండీహెచ్ ప్రైవేటు లిమిటెడ్, ఎవరెస్ట్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌‌కు సంబంధించిన మసాల ఉత్పత్తుల విక్రయాలపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే సింగపూర్ ప్రభుత్వం కూడా నిషేధం విధించిందని పేర్కొన్నాయి. ఈ కంపెనీలు విక్రయిస్తున్న పలు మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించామని, పరిమితికి మించిన మోతాదులో ఉన్నట్టు తేలిందని, అందుకే హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించిందని కథనాలు పేర్కొన్నాయి.

కాగా భారతీయ మసాలా దినుసుల బ్రాండ్లకు విదేశాల్లో రీకాల్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2023లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ.. ఎవరెస్ట్ ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందని గుర్తించి వాటిని రీకాల్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.


More Telugu News