అల్లు అర్జున్‌కూ తప్పని ‘డీప్ ఫేక్’ తిప్పలు.. విస్తుపోయే వీడియో ఇదిగో

  • కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
  • ఇటీవలే ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌ల డీప్ ఫేక్ వీడియోలను వైరల్‌గా మార్చిన వైనం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సెలబ్రిటీలు తమకు ప్రచారం చేస్తున్నారంటూ పుట్టుకొస్తున్న డీప్‌ఫేక్ వీడియోల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వేర్వేరు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోల తిప్పలు ఇండియా స్టార్ అల్లు అర్జున్‌కు కూడా తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏఐ-ఆధారిత టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోను చూసిన వారెవరైనా అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేస్తున్నాడని నమ్ముతారనడంలో అతిశయోక్తిలేదు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే..
అల్లు అర్జున్ ఓపెన్-టాప్ కారులో నిలబడ్డట్టు వీడియోను రూపొందించారు. ప్రజల వైపు చూస్తూ, నవ్వుతూ చేతులు ఊపుతున్నట్టు ఆయన కనిపించారు. అంతేకాదు, పక్కనే భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నట్టు సృష్టించారు. 'కాంగ్రెస్ గౌరవం కోసం అల్లు అర్జున్ బరిలో నిలిచారు' అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇండియాలోనే అతిపెద్ద సూపర్‌స్టార్ అల్లు అర్జున్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని మరో వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. కాగా 2022లో అల్లు అర్జున్ న్యూయార్క్ సందర్శనకు వెళ్లినప్పటి వీడియోను ఈ విధంగా ఉపయోగించుకున్నారని ప్రాథమికంగా అర్థమవుతోంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అల్లు అర్జున్ దంపతులు న్యూయార్క్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు నిర్వహించే ప్రసిద్ధ వార్షిక కార్యక్రమమైన 'ఇండియా డే పరేడ్'లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ వీడియోను ఉపయోగించుకొని ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.

కాగా ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌లు ఇటీవల డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు. రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తున్నట్టుగా సృష్టించారు. అయితే వీటిని సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయిన విషయం తెలిసిందే.


More Telugu News