మే 13న వచ్చేది పెనుతుపాను: శృంగవరపుకోటలో చంద్రబాబు

  • విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభ
  • రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్న చంద్రబాబు
  • మే 13న వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. శృంగవరపుకోట సభను చూస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోందని అన్నారు. తాను అనేక తుపానులు చూశానని, హుద్ హుద్ తుపాను చూశానని, దానిని మించిన పెనుతుపాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతుందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

"గుంటూరు జిల్లాకు చెందిన కోవూరు లక్ష్మి అనే అమ్మాయి ఆదర్శ మహిళా మండలి నడుపుతోంది. అక్కడ సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేసి నేరాలు చేయిస్తుంటే చూసి భరించలేక పోరాడింది. ఎక్కడికక్కడ ప్రైవేటు భూములను కూడా కబ్జా చేస్తుంటే గట్టిగా పోరాడింది. చివరికి ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలిసేందుకు ప్రయత్నించింది. ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతూ తన చేతి బొటనవేలిని కోసేసుకుంది. ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. 

కర్నూలులో అబ్దుల్ సలాం అనే వ్యక్తి బాధలు భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే తన పిల్లలను అనాథలైపోతారని, భార్యను అవమానిస్తారని భావించి భార్యతో కలిసి చనిపోవాలనుకున్నాడు. తామిద్దరం చనిపోతే పిల్లలు ఒంటరివాళ్లయిపోతారని... అందరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి పిల్లలను పట్టాలకు కట్టేసి, తాము కూడా పట్టాలపై పడుకుని రైలు కింద పడి చనిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఒక అరాచకశక్తి రాష్ట్రాన్ని ఏలుతున్నట్టు అనిపిస్తోంది. ఒక దుర్మార్గుడు చేతిలో మనం బలైపోవాల్సిందేనా? 

ఇతడు మామూలు అహంకారి కాదు. ఎవరైనా తనకు అన్యాయం జరిగిందంటే వాళ్లను వేధిస్తున్నారు... ఒక్కోసారి చంపేస్తున్నారు. ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఎంవీఎస్ మూర్తి గారు గీతం యూనివర్సిటీని స్థాపించారు. నేను కూడా సహకరించాను. ఒక శుక్రవారం సాయంత్రం ప్రొక్లెయిన్ తీసుకువచ్చి వర్సిటీ భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేస్తుంటే భరత్ ఎలాగోలా కాపాడుకున్నాడు. కానీ అప్పటికే కాంపౌండ్ వాల్ కూల్చేశారు. 

ప్రతి శుక్రవారం కేసులు పెట్టి లోపలేస్తారు, లేకపోతే, ప్రొక్లెయిన్ తీసుకువచ్చి ఆస్తులు ధ్వంసం చేస్తారు. రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఒక అహంకారి. ఆ అహంకారానికి సైకోతనం తోడైంది. రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయం అయింది" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News