జగన్ కు... పవన్, చిరంజీవికి ఉన్న తేడా అదే!: పోసాని

  • మెగా బ్రదర్స్ పై ధ్వజమెత్తిన పోసాని
  • జగన్ ప్రజల కోసం పార్టీ పెట్టారని వెల్లడి
  • మెగా ఫ్యామిలీ పైసల కోసమే పార్టీ పెట్టిందని విమర్శలు
  • జగన్ ను తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెప్పడంలేదన్న పోసాని
వైసీపీ నేతలు, ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి జనసేనాని పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని, కానీ మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్ కు... పవన్, చిరంజీవిలకు ఉన్న తేడా అదేనని అన్నారు. 

పవన్ కల్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లెయ్యరని, జగన్ ను నోటికొచ్చినట్టు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతున్నాడా? అని పోసాని ప్రశ్నించారు. 

"జగన్ ను మీరు గమనించండి... ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా ఎంతో మర్యాదగా మాట్లాడతారు. జగన్ జన నాయకుడు... ప్రజల వ్యక్తి. ఆయన వన్ మేన్ ఆర్మీ... అంకితభావానికి పర్యాయపదం జగన్. పవన్, చిరంజీవి ఈ విషయం గమనించాలి. 

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులంతా సంతోషించారు. కొందరు కాపు నేతలు తమ ఆస్తులను కూడా కాదనుకుని పార్టీ కోసం కృషి చేశారు. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ ప్రజారాజ్యం పార్టీ బుడగలా పేలిపోయింది. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ కు అమ్మేశారు. 

చిరంజీవి కొట్టిన ఆ దెబ్బకు కాపులంతా ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. చిరంజీవి మాత్రం రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. 

ఇక, పవన్ ఒక మెంటల్ కేసు. గతంలో లోకేశ్ ను తిండిపోతు అని వ్యాఖ్యానించారు, లోకేశ్ తన అవినీతితో రాష్ట్రాన్ని కబళించాడని విమర్శించారు. చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించగానే వెళ్లి ఆయన కాళ్లపై పడ్డారు. 

ఇప్పుడు చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. తద్వారా కాపుల్లో ఎవరూ ముఖ్యమంత్రిగా పనికిరారు అని పవన్ తేల్చేశారు. అంతేకాదు, తాను కూడా సీఎంగా పనికిరానని చెప్పుకుంటున్నారు. గంపగుత్తగా కాపులందరి ఓట్లు చంద్రబాబుకు వేయించాలన్నదే పవన్ ప్రణాళిక" అంటూ పోసాని విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News