8 ఏళ్ల శాలరీని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యం?: 25వేల ఉద్యోగాల రద్దుపై మమతా బెనర్జీ

  • కోర్టు తీర్పును సవాల్ చేస్తామన్న ముఖ్యమంత్రి
  • 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న హైకోర్టు
  • 25వేలకు పైగా నియామకాలను రద్దు చేయడంతో పాటు 8 ఏళ్ల శాలరీని 12 శాతం వడ్డీతో చెల్లించాలన్న కోర్టు
  • ఉద్యోగాలు పోయిన వారికి అండగా నిలబడతామని మమత హామీ
25వేల మంది టీచర్లు... తమ 8 ఏళ్ల శాలరీని నాలుగు వారాల్లో తిరిగి ఇచ్చేయాలన్న హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యం? అని వాపోయారు. 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెబుతూ హైకోర్టు 25వేలకు పైగా ఉద్యోగుల నియామకాన్ని రద్దు చేసింది. అంతేకాదు, ఈ వేతనాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడవద్దని చెప్పారు. కొందరు బీజేపీ వారు న్యాయమూర్తులను, న్యాయవాదులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.


More Telugu News