జగన్ 25న నామినేషన్ వేస్తున్నారట... ఆ రోజున నేను నామినేషన్ వేయకూడదంటున్నారు.: దస్తగిరి

  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
  • జై భీమ్ భారత్ పార్టీలో చేరిన వైనం
  • పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ
  • ఈ నెల 25న నామినేషన్ వేయాలని నిర్ణయం
  • అయితే తనను 23 కానీ, 24వ తేదీ కాని నామినేషన్ వేసుకోమంటున్నారని ఆరోపణ
  • పోలీసులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి... జై భీమ్ భారత్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పార్టీ తరఫున దస్తగిరి పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నాడు. 

ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన దస్తగిరి తన నామినేషన్ అంశంపై స్పందించాడు. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో ఇక్కడికి వస్తున్నాడని, జగన్ నివాసం పక్కన జై భీమ్ భారత్ ఆఫీస్ బోర్డులు కనిపించకూడదంటూ సచివాలయం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి చెప్పారని దస్తగిరి వెల్లడించాడు. అయితే, జై భీమ్ భారత్ పార్టీ ఆఫీసు తొలగించే ప్రశ్నే లేదని, బోర్డులు కూడా తీసేయబోమని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని వారికి స్పష్టం చేశామని వివరించాడు. 

ఇక తాను 25వ తేదీ నామినేషన్ వేయాలనుకుంటుంటే, అదే రోజున జగన్ నామినేషన్ వేస్తున్నాడని తనను అడ్డుకుంటున్నారని దస్తగిరి ఆరోపించాడు. 25వ తేదీ జగన్ కోసం ప్రత్యేకంగా కేటాయించారా, అలాగని ఈసీ ఏమైనా నిబంధనలు పెట్టిందా... లేదు కదా... పోలీసులను కీలుబొమ్మ చేసి ఆడుకుంటున్నారు అంటూ మండిపడ్డాడు. తనను 23 కానీ, 24వ తేదీ కానీ నామినేషన్ వేసుకోమంటున్నారని దస్తగిరి వెల్లడించాడు. పోలీసు వ్యవస్థ ఎందుకిలా వ్యవహరిస్తుందో అర్థం కావడంలేదన్నాడు.


More Telugu News