టిఫిన్ చేసేందుకు బస్సును ఆపిన డ్రైవర్.. ఆలస్యమవుతోందంటూ డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడి

  • దాడికి నిరసనగా బస్సులు నిలిపివేసిన డ్రైవర్లు
  • 45 బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు
  • నవాజ్‌పై చర్యలు తీసుకోవాలని డ్రైవర్ల నిరసన
  • పోలీసులకు ఫిర్యాదు
వికారాబాద్‌ డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రాములపై నవాజ్ అనే వ్యక్తి దాడికి దిగడం కలకలం రేపింది. ఈ ఘటనతో నిరసనకు దిగిన డ్రైవర్లు బస్సులను ఎక్కడివక్కడ నిలిపివేశారు. రాములుపై దాడిచేసిన నవాజ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో దాదాపు 45 బస్సులు నిలిచిపోవడంతో వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాములుకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. నవాజ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?..

టిఫిన్ చేసేందుకు డ్రైవర్ రాములు వికారాబాద్ బస్టాండ్‌లో బస్సును నిలిపాడు. బస్సులోనే టిఫిన్ చేసేందుకు సిద్ధమైన డ్రైవర్, కండక్టర్‌పై నవాజ్ విరుచుకుపడ్డాడు. ఇలాగైతే బస్సు ఆలస్యమైపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు నిమిషాల్లో టిఫిన్ పూర్తిచేసి బయలుదేరుదామని వారు బదులిచ్చారు. అయినప్పటికీ వినిపించుకోని నవాజ్ వారిని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు.


More Telugu News