నా చేతిలో బాణమూ లేదు.. అక్కడ మసీదూ లేదు.. ఫిర్యాదుపై మాధవీలత వివరణ

  • హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలత
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై పోలీసులకు ఫిర్యాదు
  • తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారన్న మాధవీలత
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తనపై నమోదైన కేసుపై స్పందించారు. ఇటీవల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమె మసీదు వైపుగా బాణం ఎక్కుపెడుతున్నట్టుగా పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. దీనిపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి  ఆదివారం ఆమెపై బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.

తనపై నమోదైన కేసుపై స్పందించిన మాధవీలత.. తాను ముస్లింలకు వ్యతిరేకినైతే పవిత్ర రంజాన్ మాసంలో ఊరేగింపులో ఎందుకు పాల్గొంటానని,  తన చేతుల మీదుగా ఆహారాన్ని ఎందుకు పంపిణీ చేస్తానని ప్రశ్నించారు. రజత్‌శర్మ ‘ఆప్ కి అదాలత్’లో పాల్గొన్నప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ చేసుకున్నారని పేర్కొన్నారు.  

లేని ధనుస్సు, లేని బాణానికి తనపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దానిని ఎవరో వీడియో చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. ముస్లింలను తాను రెచ్చగొట్టానని తనపై ఒకరు ఫిర్యాదు చేశారని, కానీ ఆ వీడియోలో మసీదు లేదని, తనపై ఫిర్యాదు హాస్యాస్పదమని మాధవీలత పేర్కొన్నారు.


More Telugu News