ఫుల్‌టాస్‌కు అవుట్ కావడంపై అంపైర్లతో కోహ్లీ వాగ్వివాదం.. అసలు నిబంధనలు చెబుతున్నదేమిటి?

  • హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటైన కోహ్లీ
  • అది నోబాల్ అంటూ రివ్యూ కోరిన విరాట్ 
  • బంతి తన నడుము పైభాగం నుంచి వెళ్లిందన్న కోహ్లీ
  • రీప్లేలో ఫెయిర్ డెలివరీగానే తేలిన వైనం
  • కోపంతో క్రీజు వదిలిన కోహ్లీ
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అవుట్‌పై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. ఫాస్ట్‌ బౌలర్ హర్షిత్ రాణా వేసిన ఫు‌ల్‌టాస్‌ను తిరిగి నేరుగా అతడి చేతుల్లోకే పంపాడు. దీంతో కేకేఆర్ జట్టు సంబరాల్లో మునిగిపోగా, కోహ్లీ వెంటనే అవుట్‌పై రివ్యూ కోరారు. బంతి తన నడుము భాగానికిపై నుంచి వచ్చిందన్నది కోహ్లీ వాదన. అయితే, రీప్లేలో మాత్రం అది ఫెయిర్‌ డెలివరీగానే తేలింది. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా వచ్చింది. 

ఆ నిర్ణయంతో కోహ్లీ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. కెప్టెన్ ఫా డుప్లెసిస్‌తో కలిసి అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో కోహ్లీ మొహంలో కోపం స్పష్టంగా కనిపించింది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అతడు తీవ్ర అసంతృప్తితో డగౌట్‌కు వెళ్లడం కనిపించింది. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ చట్టం 41.71 ప్రకారం.. బంతి పిచ్ కాకుండా నిటారుగా నిలబడి ఉన్న స్ట్రైకర్‌‌కు నడుము ఎత్తులో డెలివరీ అయినా, అయే అవకాశం ఉన్నా దానిని అన్‌ఫెయిర్ డెలివరీగా పరిగణిస్తారు. ఎందుకంటే అది స్ట్రైకర్ శరీరానికి గాయం కలిగించే అవకాశం ఉంది. అలాంటి బంతిని అంపైర్ వెంటనే నో బాల్‌గా ప్రకటిస్తాడు.  

అంపైర్లతో వాగ్వివాదం సందర్భంగా బంతి తన నడుము పై నుంచి వెళ్లిందని చెప్పాడు. అయితే, కోహ్లీ సాధారణ పొజిషన్‌లో నిలబడి ఉంటే బంతి నడుము కంటే కింది భాగంలోనే నేలను తాకి ఉండేదని రీప్లేలో స్పష్టమైంది. దీనికితోడు కోహ్లీ అప్పటికే క్రీజు బయటకు వచ్చి ఉండడంతో దానిని ఫెయిర్ డెలివరీగానే ప్రకటించారు.


More Telugu News