ఇజ్రాయెలీ సైన్యంపై ఆంక్షల దిశగా అమెరికా!

  • మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డట్టు ఇజ్రాయెలీ సైనిక బెటాలియన్‌పై ఆరోపణలు
  • ఆరోపణలపై ఏడాది పాటు దర్యాప్తు చేసిన అగ్రరాజ్యం
  • తప్పు చేస్తున్న సైనిక బృందాలపై ఆంక్షల దిశగా ఆలోచిస్తున్న అమెరికా
  • ఆంక్షలను తమ శక్తికొలదీ అడ్డుకుంటామన్న ఇజ్రాయెల్
గాజాలో సామాన్య పౌరులపై మానవహక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెలీ సైనిక దళాలు, పోలీసులపై అమెరికా ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ఇజ్రాయెలీ సైన్యానికి చెందిన నెట్జా యహూదా బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు బైడెన్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా 14 బిలియన్ డాలర్ల మిలిటరీ సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న అమెరికా మరోవైపు ఆంక్షలకూ సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే, అమెరికా ఆంక్షలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

అమెరికా అంక్షలను అడ్డుకునేందుకు తమ శక్తికొలదీ ప్రయత్నిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు పేర్కొన్నారు. ‘‘మా సైన్యం ఆంక్షలు విధించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలను మా శక్తినంతా ధారపోసి అడ్డుకుంటాం’’ అని ప్రధాని ఆదివారం వ్యాఖ్యానించారు. 

కాగా, ఇజ్రాయెల్‌ సైన్యంలోని నెట్జా యహూదా బెటాలియన్‌ కార్యకలాపాలపై అమెరికా ఏడాది పాటు దర్యాప్తు చేసింది. వెస్ట్‌బ్యాంకులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సైనిక బృందాలపై కూడా దృష్టి సారించింది. పెద్దఎత్తున సామాన్యులపై మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసింది. అమెరికా ఆంక్షలు విధిస్తే, ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఇజ్రాయెల్‌పై సీరియస్ అవ్వొచ్చన్న అభిప్రాయం వినబడుతోంది. ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్ దళాలకు అమెరికా ఆయుధాలు ఇతర సైనిక పరికరాలను వినియోగించేందుకు అనుమతి ఉండదు. అయితే, అమెరికా నిధులతో ఈ బృందాలు తమంతట తాముగా ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


More Telugu News