జడ్జి అవతారమెత్తి వందలాది ఖైదీలకు బెయిల్ ఇచ్చిన ఘరానా కేటుగాడు... వయసు 85!

  • 85 ఏళ్ల వయసులో మరణించిన మహా గజదొంగ
  • 1000కి పైగా నేరాలు చేసి, 90 సార్లు జైలుకు వెళ్లొచ్చిన ధనీ రామ్ మిట్టల్
  • చదివింది న్యాయశాస్త్రం... చేసేవి దొంగతనాలు, మోసాలు
  • ఇటీవలే మృతి చెందిన ధనీ రామ్ మిట్టల్
ఓ 100 చోరీలు చేసిన వాడ్ని గజదొంగ అంటే... 1000కి పైగా నేరాలు చేసిన వాడ్ని ఏమనాలి? ఢిల్లీకి చెందిన ధనీ రామ్ మిట్టల్ అనే వ్యక్తి తన 85 ఏళ్ల వయసులో ఇటీవల మరణించాడు. అతడి చరిత్ర చూసి పోలీసులే నివ్వెరపోయారు. 1964 నుంచి 2016 వరకు చోరీలు, వివిధ నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. 

ఇన్నేళ్ల కాలంలో ధనీ రామ్ మిట్టల్ 1000కి పైగా నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. చోరీలు, చీటింగ్ లు, ఫోర్జరీలు, మారువేషాలతో బురిడీ కొట్టించడం వంటి నేరాలు అతడి జాబితాలో ఉన్నాయి. అన్నిటికంటే ఘరానా మోసం ఏమిటంటే... జడ్జి అవతారమెత్తి ఏకంగా వందలాది మంది ఖైదీలకు బెయిల్ ఇచ్చాడు.

ధనీ రామ్ మిట్టల్ రోహతక్ లో బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. న్యాయశాస్త్రం చదివేందుకు రాజస్థాన్ వెళ్లాడు. ఎల్ఎల్ బీ పూర్తయ్యాక కొందరు అడ్వొకేట్ ల వద్ద క్లర్క్ గా పనిచేశాడు. ఆ సమయంలో సరదా కోసం కార్ల దొంగతనాలు చేసేవాడు. ఫోర్జరీ చేసి స్టేషన్ మాస్టర్ ఉద్యోగం సంపాదించాడు. 

60 ఏళ్ల పాటు చోరీలే జీవితంగా బతికిన ధనీ రామ్ 90 పర్యాయాలు జైలుకు వెళ్లొచ్చాడు. 77 ఏళ్ల వయసులోనూ ఓ కారును చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనీ రామ్ మిట్టల్ ఈ నెల 18న కన్నుమూశాడు.


More Telugu News