జగన్ కంటే కుంభకర్ణుడు నయం: వైఎస్ షర్మిల

  • కర్నూలులో షర్మిల ఎన్నికల ప్రచారం
  • ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని బీజేపీ మోసం చేసిందన్న షర్మిల
  • ఏపీలో వైసీపీ కూడా నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం
  • ఎన్నికల ముందు దగా డీఎస్సీ ప్రకటించారని విమర్శలు 
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి బీజేపీ మోసం చేసిందని అన్నారు. ఆ లెక్కన ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా... వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీలో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాలేదని తెలిపారు. 

బీజేపీ సంగతి అలా ఉంటే, ఏపీలో వైసీపీ కూడా అలాగే నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రతి ఏడాది సంక్రాంతి ఎలా వస్తుందో, జాబ్ క్యాలెండర్ కూడా అలాగే వస్తుందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని షర్మిల వెల్లడించారు. 

రాష్ట్రంలో 2.30 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... నేను అధికారంలోకి వచ్చాక అవన్నీ భర్తీ చేస్తాను అని జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పారని వివరించారు. ఐదేళ్లయినా గానీ ఆ రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ కాలేదని, మరి జగన్ ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మి ఓటేస్తే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు. 

రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, ఈ ఐదేళ్లు ఎందుకు డీఎస్సీ వేయలేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు రెండు నెలల ముందు 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ ప్రకటించారని షర్మిల మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే... వీళ్లకు పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్లకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా, చచ్చేదా? అని వ్యాఖ్యానించారు. 

"ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉండకూడదు? కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొని ఉంటాడు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని నిద్రలేచారు... సిద్ధం అంటూ బయల్దేరారు. ఇంతకుముందు ఎప్పుడైనా జగన్ ఇలా జనాల్లోకి వచ్చారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అని అడిగారా? మీకు ఇళ్లు ఉన్నాయా అని అడిగారా? మరి ఇన్నేళ్లు ఏం చేస్తున్నట్టు?" అంటూ షర్మిల ధ్వజమెత్తారు.


More Telugu News